సీమా కుష్వాహా…. నిర్భయ కేసులో అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాది.. నిర్భయ ఘటనలో బెదిరింపులకు భయపడకుండా.. అడ్డంకులను అధిగమిస్తూ న్యాయాన్ని గెలిపించిన లాయర్! ఇప్పుడామె హథ్రస్ బాధితురాలికి కేసును కూడా వాదించాలనుకుంటున్నారు.. ఇందుకోసం ఆమె నిన్న బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించారు.. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు సీమాను దారిలోనే అడ్డుకున్నారు.. బాధితురాలి కుటుంబసభ్యుల విన్నపం మేరకే తాను వచ్చానని, అధికారయంత్రాంగం మాత్రం అవరోధాలు కల్పిస్తున్నదని సీమా కుష్వాహా ఆవేదనతో అన్నారు.. కుటుంబాన్ని కలిసిన తర్వాతే తాను వెనక్కి వెళతానని గట్టిగా చెప్పారు. బాధితురాలి అన్నతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ కేసును తప్పకుండా టేకప్ చేస్తానని, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తానని ఆమె తెలిపారు.
నిర్భయ ఘటన మన స్మృతిపథంలో ఇంకా మెదులుతూనే ఉంది. డిసెంబర్ 16, 2012న ఢిల్లీలో జరిగిన ఆ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిచింది.. అప్పుడు బాధితురాలి తరఫున వాదించి, కేసును గెలిపించింది సీమానే! నిర్భయకు జరిగిన అన్యాయమే ఇప్పుడు హథ్రస్‌లో 19 ఏళ్ల దళిత యువతికి జరిగింది.. ఆ అమ్మాయిపై అగ్రకులానికి చెందిన నలుగురు అత్యాచారినికి పాల్పడి ఆమెను దారుణంగా హింసించారు.. తీవ్ర గాయాలతో ఆమె ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెబుతున్న అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌కుమార్ … ఆ అమ్మాయిపై అత్యాచారం జరిగినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో లేదని పేర్కొనడం గమనార్హం..