
నేషనల్ హైవేలపై ప్రయాణించాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే. టోల్ ఫీజ్ కట్టకుండా జర్నీ చేయడం కష్టం. అయితే గతంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కేంద్రం ఫాస్టాగ్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఫాస్టాగ్ ఉంటే చాలు.. టోల్ గేట్ల దగ్గర ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేకుండా రయ్ మని వెళ్లొచ్చు. ఆ తర్వాత ఫాస్టాగ్ స్కీమ్‌లో కేంద్రం ఎన్నో మార్పులు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్‌ను కరెక్ట్‌గా వాడని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనాలపై అతికించడం లేదు. టోల్ గేట్స్ వచ్చినప్పుడు లోపలి నుంచి తీసి చూపిస్తున్నారు. దీనివల్ల రద్దీ పెరుగుతుందనే ఫిర్యాదులు అందడంతో కేంద్రం చర్యలు చేపట్టింది. లూజ్ ఫాస్టాగ్‌లను ఇకపై బ్లాక్ లిస్ట్‌లో పెట్టనుంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
లూజ్ ఫాస్టాగ్‌లను వాడేవారిని గుర్తించి తమకు సమాచారం ఇవ్వాలని టోల్ వసూల్ సంస్థలకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా కేంద్రం వారి ఫాస్టాగ్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది. అంతేకాకుండా విండ్ షీల్డ్‌పై ఫాస్టాగ్ అతికించని వాహనాల నుంచి డబుల్ టోల్ వసూల్ చేయనుంది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ పెట్టకపోతే స్కానింగ్ సమస్యలు వస్తున్నాయని.. దీనివల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ పెరిగి ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం తెలిపింది. దీనికి చెక్ పెట్టేందుకే లూజ్ ఫాస్టాగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని వల్ల ప్రయాణికుల టైమ్ కూడా సేవ్ అవుతుందని చెప్పింది. అంతేకాకుండా త్వరలో అందుబాటులోకి రానున్న ఆన్యువల్ పాస్ వ్యవస్థ, మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోలింగ్ వంటి స్కీమ్స్ దృష్ట్యా ఫాస్టాగ్ ప్రామాణికత, వ్యవస్థపై నమ్మకం పెంచడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ఏదిఏమైనా నిబంధనలు ఉల్లంఘించే వారిని ఇకపై సహించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..