Maharashtra: మహారాష్ట్రలో మరోసారి వేడెక్కిన రాజకీయం.. చిచ్చుపెట్టిన ప్రాజెక్టులు.. షిండే, థాకరే వర్గాల సవాళ్ల పర్వం..

మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. వేదాంత ఫాక్స్‌ కాన్‌, టాటా ఎయిర్‌ బస్‌ ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలి వెళ్లడంపై రచ్చ నడుస్తోంది.

Maharashtra: మహారాష్ట్రలో మరోసారి వేడెక్కిన రాజకీయం.. చిచ్చుపెట్టిన ప్రాజెక్టులు.. షిండే, థాకరే వర్గాల సవాళ్ల పర్వం..
Uddhav Vs Shinde

Updated on: Nov 01, 2022 | 9:55 PM

మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. వేదాంత ఫాక్స్‌ కాన్‌, టాటా ఎయిర్‌ బస్‌ ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలి వెళ్లడంపై రచ్చ నడుస్తోంది. కోట్లాది రూపాయల కీలక ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలివెళ్లడంపై షిండే, థాకరే వర్గాలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌కు సవాల్ విసిరారు ఆదిత్య థాకరే. అయితే, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని షిండే సర్కార్ కౌంటర్ ఇస్తోంది. 30 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

కీలకమైన వేదాంత ఫాక్స్‌ కాన్‌, టాటా ఎయిర్‌బస్‌ ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలివెళ్లడం మహారాష్ట్రలో అగ్గి రాజేశాయి. ఆ ప్రాజెక్టులను నిలుపుకోవడంలో షిండే ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. సీఎం ఏక్‌నాథ్‌ షిండే-డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లపై నిప్పులు చెరుగుతున్నాయి. ఐతే ప్రాజెక్టులు తరలిపోవడంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడుతోంది అధికార పక్షం. వేదాంత-ఫాక్స్‌కాన్, టాటా-ఎయిర్‌బస్ వంటి మెగా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాయనే దానిపై 30 రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు పరిశ్రమల శాఖా మంత్రి ఉదయ్‌ సామంత్‌. ఈ ప్రాజెక్టులపై కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని..శ్వేతపత్రంతో స్పష్టత వస్తుందన్నారు. టాటా ఎయిర్‌బస్‌ ప్రాజెక్టును నాగ్‌పూర్‌లోని ప్రతిపాదిత స్ధలంలో ఏర్పాటు చేసేందుకు..తాము ఈ ప్రాజెక్టును వెనక్కితీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి తరలివెళ్తున్నాయని ఎదురుదాడికి దిగింది షిండే ప్రభుత్వం. ఐతే ఆ వాదనను ఖండించారు మాజీ మంత్రి ఆదిత్య థాకరే. ఈ ఏడాది ప్రారంభంలో వేదాంత అధికారులతో పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కోరితే అక్కడ విమానాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని టాటా-ఎయిర్‌బస్ అధికారులు చెప్పారని వెల్లడించారు. ఇలాంటి కీలక ప్రాజెక్టులు గుజరాత్‌కు తరలిపోవడం వల్ల స్థానికుల్లో అనేకమందికి ఉద్యోగావకాశాలు పోయాయని..ప్రాజెక్టులు నిలుపుకోవడంలో షిండే సర్కార్ విఫలమైందని ఆరోపిస్తున్నారు. తన పదవిని కాపాడుకునేందుకు షిండే బీజేపీకి లొంగిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..