New Covid Strain : రూపాంతరం చెందిన కరోనా వైరస్‌తో ఆందోళన అవసరం లేదు.

కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆకాంక్షలతో అడుగు పెట్టాలనుకున్నాం కానీ కరోనా మహమ్మారి మనకా ఆవకాశం ఇవ్వడం లేదు.. ఈ ఏడాది మొత్తం కరోనా మింగేసింది..

New Covid Strain : రూపాంతరం చెందిన కరోనా వైరస్‌తో ఆందోళన అవసరం లేదు.

Updated on: Dec 23, 2020 | 11:45 AM

కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆకాంక్షలతో అడుగు పెట్టాలనుకున్నాం కానీ కరోనా మహమ్మారి మనకా ఆవకాశం ఇవ్వడం లేదు.. ఈ ఏడాది మొత్తం కరోనా మింగేసింది.. ప్రశాంతతను దూరం చేసింది.. 2021లోనైనా చీడపీడల నుంచి హాయిగా ఉందామనుకుంటే కోవిడ్‌ వైరస్‌ కొత్త రకం కోరలు చాస్తూ మరింత భయపెడుతోంది.. బ్రిటన్‌లో ఆ కొత్తరకం వైరస్‌ విస్తరిస్తుండటం కలవరం కలిగిస్తోంది.. ఇదంతా చూస్తుంటే చరిత్ర పునారవృత్తం అవుతున్నదా అన్న అనుమానం కలుగుతోంది.. వందేళ్ల కిందట స్పానిష్‌ ఫ్లూ అనే మహమ్మారి కూడా ఇలాగే విజృంభించి కోట్లాది మందిని బలి తీసుకుంది.. అన్నట్టు ఆ వైరస్‌ మహమ్మారిగా రూపాంతరం చెందింది కూడా బ్రిటన్‌లోనే కావడం గమనార్హం.. మొదటి ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత రణక్షేత్రంలో పాలుపంచుకున్న సైనికులంతా తట్టాబుట్టా సర్దుకుని సొంత దేశాలకు వెళుతున్న సమయం అది! బ్రిటన్‌ రాజధాని లండన్‌కు 190 మైళ్ల దూరంలో ఉన్న పోర్ట్‌ సిటీప్‌ లైమౌత్‌ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు, ఫ్రాన్స్‌లోని బ్రెస్ట్‌కు, సౌతాఫ్రికాలోని ఫ్రీటౌన్‌కు మూడు సైనిక నౌకలు బయలుదేరాయి.. ఆ సైనికులు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.. చాలామంది చనిపోయారు.. ఎందుకు చనిపోతున్నారో తెలుసుకునేలోగా ఆ వైరస్‌ మిగతా దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌కు సంబంధించిన వివరాలు స్పెయిన్‌ చెప్పడంతో దానికి స్పానిష్‌ ఫ్లూ అని పేరు పెట్టారు.. 1918 మార్చిలో అమెరికాలో తొలికేసు నమోదైంది.. అప్పుడు అమెరికాలో చనిపోయింది 189 మందే! అయితే సెప్టెంబర్‌ మాసంలో యూరప్‌ నుంచి తిరిగి వచ్చిన సైనికులతో ఒక్కసారిగా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యింది.. అది లక్షలాది మంది మనుషుల ప్రాణాలను తీసింది.. ఆ స్పానిష్‌ ఫ్లూ మనదేశంలోకి కూడా చొచ్చుకొచ్చింది.. యూరప్‌ నుంచి వచ్చిన సైనికుల నౌక ముంబాయికి వచ్చింది.. ఆ సైనికులతో పాటే స్పానిష్‌ ఫ్లూ కూడా వచ్చింది.. మనదేశంలోనూ కోటిన్నర మంది ఈ మహమ్మారికి బలయ్యారు. స్పానిష్‌ ఫ్లూ కనీసం సెకండ్‌ వేవ్‌లోనే ప్రబలింది కానీ కరోనా వైరస్‌ మాత్రం తొలి వేవ్‌లోనే ప్రతాపం చూపింది.. ఇప్పుడు బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త రూపాంతరం వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదంటున్నారు వైద్యులు.. అయినప్పటికీ బ్రిటన్‌లో ప్రబలుతున్న కొత్త రకం కరోనా భారత్‌లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు.. మనకు మనమే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది..