NEET 2023 : దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి NEET పరీక్షలకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో NEET పరీక్ష నిర్వహించేందుకు సర్వసన్నాహాలు చేశారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.గంటల20 నిముషాల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.30 తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు వెల్లడించారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. వైద్యవిద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌ను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణా సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే NEET 2023 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
పరీక్ష రాసే విద్యార్థులు అడ్మిట్ కార్డుని తప్పనిసరిగా ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఆధార్ కార్డు, లేదా పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లాంటి….ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు సైతం తప్పనిసరిగా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 499 సెంటర్ల లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో సైతం పరీక్ష రాసే విద్యార్థుల కోసం 14 చోట్ల నీట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 22 పరీక్ష కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి 50 వేల మందికిపైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు.
ఇక పరీక్షా కేంద్రాల్లోకి వాచ్‌లు, బ్రాస్లెట్, బంగారు ఆభరణాలు, ఫుడ్ ఐటెమ్స్, వాటర్ బాటిల్స్‌ని అనుమతించరు. పొడవు చేతుల దుస్తులను సైతం వేసుకోకపోవడమే మంచిది. వాలెట్లు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్టులు, టోపీలు వంటివి ధరించకూడదు. మొబైల్ పోన్లు, బ్లూటూత్‌లు, ఇయర్‌ఫోన్లు, పేజర్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు లోనికి అనుమతించరు. సాంప్రదాయ దుస్తులు, వస్తువులతో వస్తే కనీసం రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి రావాలని సూచించారు అధికారులు. తెలుగు తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించే నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది హాజరవుతున్నారు. ఏపీలో 265 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..