AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET 2017 Topper Suicide: నీట్‌ 2017 టాపర్‌ నవదీప్ సింగ్ ఆత్మహత్య.. హాస్టల్ గదిలో దొరకని సూసైడ్‌ నోట్‌

నీట్ టాపర్‌ డాక్టర్ నవదీప్ సింగ్ తన హాస్టల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఏఎంసీ)లో ఎండీ రెండో సంవత్సరం చదువుతున్న ముక్త్‌సర్‌కు చెందిన డాక్టర్ నవదీప్ సింగ్ ఆదివారం ఉదయం తన హాస్టల్‌ గదిలో శవమై కనిపించాడు. 2017లో నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)లో అగ్రస్థానంలో నిలిచిన డాక్టర్ సింగ్ (25) సూసైడ్‌ దేశ..

NEET 2017 Topper Suicide: నీట్‌ 2017 టాపర్‌ నవదీప్ సింగ్ ఆత్మహత్య.. హాస్టల్ గదిలో దొరకని సూసైడ్‌ నోట్‌
NEET 2017 Topper Suicide
Srilakshmi C
|

Updated on: Sep 17, 2024 | 8:22 AM

Share

ఢిల్లీ, సెప్టెంబర్‌ 17: నీట్ టాపర్‌ డాక్టర్ నవదీప్ సింగ్ తన హాస్టల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ (ఎంఏఎంసీ)లో ఎండీ రెండో సంవత్సరం చదువుతున్న ముక్త్‌సర్‌కు చెందిన డాక్టర్ నవదీప్ సింగ్ ఆదివారం ఉదయం తన హాస్టల్‌ గదిలో శవమై కనిపించాడు. 2017లో నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)లో అగ్రస్థానంలో నిలిచిన డాక్టర్ సింగ్ (25) సూసైడ్‌ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మృతదేహానికి ఆదివారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తైన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. సోమవారం మధ్యాహ్నం ముక్త్‌సర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

ఆదివారం ఉదయం నవదీప్ సింగ్‌కు అతని తండ్రి ఫోన్‌ చేయగా.. ఎంతకూ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతని స్నేహితులకు ఫోన్‌ చేసి, నవదీప్ సింగ్‌ గదికి వెళ్లమని చెప్పాడు. అయితే నవదీప్ సింగ్‌ తన గది తలుపు లోపలి నుంచి గొళ్లెం వేసి ఉండటాన్ని గమనించి హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించాడు. వారు వచ్చి గది తలుపులు పగలగొట్టి చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కాగా జూన్ 2017లో వచ్చిన నీట్ ఫలితాల్లో డాక్టర్ సింగ్ AIR 1 ర్యాంకు సాధించాడు. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చదవాలనుందని, నీట్‌ని క్రాక్ చేయడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకే 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 88 శాతం మార్కులతోనే సంతృప్తి చెందానని అప్పట్లో మీడియాకు తెలిపాడు. మృతుడి తండ్రి గోపాల్ సింగ్.. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలోని సరైనాగ గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. తాను ఫిజిక్స్ టీచర్‌ని, తన కొడుకు సైన్స్ సబ్జెక్ట్‌పై ఆసక్తి పెంచుకోవడానికి ఇదే కారణం అన్నారు. తన కొడుకు డాక్టర్ అవ్వాలన్నది తన కల అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఇవి కూడా చదవండి

తమ్‌కోట్ గ్రామంలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల ప్రిన్సిపాల్ కపిల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. నీట్‌ పరీక్షలో సింగ్‌ టాపర్‌గా నిలిచినప్పుడు మేమంతా అతన్ని చూసి గర్వపడ్డాం. ఎందరో యువకులు సింగ్‌ను చూసి స్పూర్తి పొందారు. జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించి అతన్ని ప్రత్యేకంగా సన్మానించారు కూడా. అలాంటి ప్రతిభ కలిగిన విద్యార్ధి సూసైడ్‌ చేసుకున్న వార్త విని మేము నిజంగానే షాక్‌కి గురయ్యామన్నారు. డాక్టర్ సింగ్ తండ్రి ఫ్యామిలీ ఫ్రెండ్‌ శర్మ మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం గోపాల్ నవదీప్‌తో మాట్లాడాడు. అప్పుడు మామూలుగానే ఉన్నాడు. ఒత్తిడిలో ఉన్నట్లు సంకేతాలేవీ కనిపించలేదు. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకునేవాడు. ఇలాంటి వ్యక్తి విపరీతమైన చర్య ఎలా తీసుకున్నాడనేది మాకు ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు. డాక్టర్ నవదీప్ సింగ్ మరణవార్తతో పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.