మొన్నటిదాకా శత్రుత్వం.. ఇప్పుడేమో బంధుత్వం.. వెన్నుపోటు పొడిచిన అల్లుడితో చేతులు కలిపిన మామ!

ఎప్పటికీ కలవని పట్టాలనుకున్నారు. కానీ పాలూనీళ్లలా కలిసిపోయేలా ఉన్నారు. మామా అల్లుళ్లు ఒక్కటయ్యారు. మహారాష్ట్రలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీలిక వర్గాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్సీపీలోని రెండువర్గాలు కలసి పోటీ చేయనున్నాయి. దీంతో పవార్‌ ఫ్యామిలీలో వివాదాలకు తెరపడబోతోంది.

మొన్నటిదాకా శత్రుత్వం.. ఇప్పుడేమో బంధుత్వం.. వెన్నుపోటు పొడిచిన అల్లుడితో చేతులు కలిపిన మామ!
Supriya Sule , Ajit Pawar

Updated on: Jan 10, 2026 | 9:09 PM

ఎప్పటికీ కలవని పట్టాలనుకున్నారు. కానీ పాలూనీళ్లలా కలిసిపోయేలా ఉన్నారు. మామా అల్లుళ్లు ఒక్కటయ్యారు. మహారాష్ట్రలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ చీలిక వర్గాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్సీపీలోని రెండువర్గాలు కలసి పోటీ చేయనున్నాయి. దీంతో పవార్‌ ఫ్యామిలీలో వివాదాలకు తెరపడబోతోంది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అలాంటిది కొట్టుకున్నా తిట్టుకున్నా ఎప్పటికైనా ఫ్యామిలీనే ఫైనలని సంకేతాలిస్తోంది ఎన్సీపీలోని చీలికవర్గాల బంధం. రెండు పార్టీల కార్యకర్తల కోరిక మేరకు కలసి పనిచేయాలని నిర్ణయానికి వచ్చినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది.

శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ పార్టీ రెండేళ్ల క్రితం చీలిపోయింది. ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో అజిత్‌ పవార్‌ అధికార మహాయుతి కూటమిలో చేరారు. తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో.. ఎన్సీపీ పార్టీ గడియారం సింబల్‌ అధికారికంగా అజిత్‌కే దక్కింది. దీంతో శరద్‌ పవార్ నేతృత్వంలోని పార్టీ ఎన్సీపీ- శరద్‌ చంద్ర పవార్‌గా ఏర్పడింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ చీలిక పార్టీలు ఎన్డీయే, ఇండియా కూటమి నుంచి వేర్వేరుగా బరిలోకి దిగాయి.

మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. మామఅల్లుళ్లు శరద్ పవార్, అజిత్ పవార్ చేతులు కలిపారు. పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కలయిక కేవలం కార్పొరేషన్‌ ఎన్నికలకే పరిమితమా.. భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా అన్నదానిపై ఇంకా రెండుపక్షాలు నిర్ణయించుకోలేదు.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. అందులో పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది. మహారాష్ట్ర కోసమే కలిసి పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నామంటున్నారు అజిత్‌ పవార్‌. ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్నా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒంటరిగా చేయాలని ఆయన నాయకత్వంలోని ఎన్సీపీ నిర్ణయించుకుంది.

తనకు వెన్నుపోటు పొడిచి పార్టీని చీల్చిన అల్లుడు అజిత్ పవార్‎తో శరద్ పవార్ చేతులు కలపడం మహా పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారింది. ఈ కలయికతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనే దానిపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..