టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండించిన నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్

|

Dec 12, 2024 | 6:33 PM

మోహన్‌బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ9 ప్రతినిధి తలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రంజిత్‌పై హత్యాయత్నానికి పాల్పడిన మోహన్‌బాబు తీరుని నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది.

టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండించిన నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్
Nbf On Mohanbabu
Follow us on

నాలుగు గోడల మధ్య రచ్చ.. ఇప్పుడూ నేషనల్ చర్చగా మారింది. చెప్పే క్రమశిక్షణ నీతులకు.. చేసిన క్రియలకు ఎక్కడైనా పొంతన లేదు. పెదరాయుడు రౌడీలా మారిపోయి రచ్చరచ్చ చేశారు. ఇంట్లో చెలరేగిన రచ్చతో విచక్షణ కోల్పోయి.. మీడియాపై దాడికి తెగబడ్డారు. అవతల ఉన్నది తనలాంటి మనిషే అన్న ఇంగితం కూడా లేకుండా.. ఉన్మాదిలా ప్రవర్తించారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ చేతిలో ఉన్న మైక్‌ను బలవంతంగా లాక్కుని.. ఎముకలు విరిగేలా కొట్టారు. దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ టీవీ9 ప్రతినిధిపై దాడి చేశారు.

టీవీ9 రిపోర్టర్‌ రంజిత్‌పై హత్యాయత్నానికి పాల్పడిన మోహన్‌బాబు తీరుని నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. జర్నలిస్ట్‌ రంజిత్‌పై చేసిన మాటలదాడి, భౌతికదాడి హేయమైనదని NBF అభిప్రాయపడింది. ఇలాంటివి వ్యక్తులపై చేస్తున్నవి దాడులు కాదు, జర్నలిజం సిద్ధాంతాలు, స్వేచ్ఛపై చేస్తున్న దాడిగా ఎన్‌బీఎఫ్ పేర్కొంది. సంబంధిత ప్రభుత్వ శాఖలు మోహన్‌బాబు ఘటనను సీరియస్‌గా తీసుకోవాలన్న కోరింది. దాడి సమయంలో పక్కనే ఉండి కూడా పట్టించుకోని పోలీసులూ ఘటనకు బాధ్యులేనన్న NBF తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటి దాడుల్ని నిరోధించేలా కఠినచట్టం కావాలని NBF డిమాండ్‌ చేసింది.

మరోవైపు టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో విచారణ జరుపుతున్నామని రాచకొండ సీపీ సుధీర్‌ బాబు తెలిపారు. రంజిత్ స్టేట్‌మెంట్ తీసుకుంటామన్నారు. ఇంట్లో గొడవల విషయంలో మంచు మనోజ్ బాండ్‌ ఇచ్చారన్నారు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు. విష్ణు బాండ్‌ సబ్‌మిట్‌ చేయలేదన్నారు. మోహన్‌బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక వెపన్ సబ్‌ మిట్ చేస్తామన్నారని తెలిపారు.

ఇదిలావుంటే, ప్రస్తుతం మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిన్న అక్కడి నలుగురు స్పెషలిస్టులు ప్రెస్‌మీట్‌ పెట్టి, మోహన్‌బాబు మానసికంగా స్థిమితంగా లేరని చెప్పారు. చీఫ్‌ డాక్టర్‌, న్యూరో డాక్టర్‌, ఆర్థోపెడీసియన్‌, సైకియాట్రిస్ట్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే, పెద్దాసుపత్రికి తరలిస్తారా? అనేదే అసలు అసలుపాయింట్‌..!

మరోవైపు, మోహన్‌బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన టీవీ9 జర్నలిస్ట్‌ రంజిత్‌‌కు వైద్యులు సర్జరీ నిర్వహించారు. తీవ్రంగా దెబ్బతిన్న జైగోమాటిక్ ఎముకను డాక్టర్ల బృందం సరిచేసింది. ఫ్రాక్చర్‌ అయినచోట స్టీల్‌ ప్లేట్‌ అమర్చారు. మూడు నాలుగు రోజులపాటు వైద్యుల అబ్జర్వేషన్‌లోనే ఉండనున్నారు. కాగా, మోహన్‌బాబు దాడిలో రంజిత్‌కి మూడుచోట్ల జైగోమాటిక్ ఎముక విరిగిందని వైద్యులు తెలిపారు. కంటికి, చెవికి మధ్య ఫ్రాక్చర్‌ కావడంతో 3గంటలపాటు సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. సర్జరీ తర్వాత కూడా మాట్లాడలేని స్థితిలో రంజిత్‌ ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..