రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో చిక్కుకుని అరెస్టయిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతున్నాడు. పేరు మోసిన గ్యాంగ్ స్టర్ కళా జతేదీ సోదరుడు ప్రదీప్ తో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. 2018 డిసెంబరు 18 న వారితో ఇతడు దిగిన ఫోటోను ఫేస్ బుక్ లో పోలీసులు షేర్ చేశారు. కళా జతేదీ అతని సోదరుడు ప్రదీప్ తో కలిసి సుశీల్ కుమార్ కూర్చున్న ఫోటో ఇదేనని పోలీసులు తెలిపారు. తన తలపై 7 లక్షల రూపాయల రివార్డు ఉన్న ప్రదీప్ లోగడ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పరారయ్యాడు. ఓ కేసులో ప్రదీప్ కి సాయపడేందుకు సుశీల్ సోనీపట్ వెళ్లాడని ఖాకీలు తెలిపారు. తనకు ఏ గ్యాంగ్ స్టర్ తోనూ సంబంధాలు లేవని సుశీల్ కుమార్ పోలీసుల విచారణలో చెప్పాడు. కానీ ఇది అబద్దమని తేలిపోయిందని ఈ ఫోటో నిరూపిస్తోందని ఖాకీలు చెప్పారు. అటు సుశీల్ చేతిలో హతుడైన సాగర్ రానాకు కూడా పరోక్షంగా విద్రోహ శక్తులతో సంబంధాలున్నట్టు వెల్లడైంది.
రానా స్నేహితుడైన సోను మహల్…కళా జతేదీకి కుడి భుజమని, అతడు సాగించిన నేరాల్లో ఇతనికి కూడా ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. సుశీల్ ని ఆరు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. కాగా తన క్లయింటును అన్యాయంగా కేసులో ఇరికించారని సుశీల్ తరఫు లాయర్ అంటున్నారు. కొందరు కావాలనే కేసును తప్పుదారి పట్టించి తన క్లయింటును చిక్కుల్లో పడేశారని, సాగర్ రానా మర్డర్ లో ఆయన హస్తం లేదని ఆ లాయర్ వాదిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Covid situation review : మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ.. పలు కీలక అంశాలపై నిర్ణయాలు
తెలంగాణలో కూడా కరోనాకు నాటుమందు.. రిస్క్ తీసుకోవద్దని హెచ్చరించిన పోలీసులు!