ఈసారి వానాకాలం కాస్త ముందే రాబోతోంది. తొలకరి జల్లు పలకరించడానికి సిద్ధంగా వుంది. నైరుతి రుతుపవనాలు మూడురోజుల ముందే కేరళను తాకేశాయి. వాతావరణ కేంద్రం ఇచ్చిన ఇండికేషన్స్ ప్రకారం.. జూన్1 నుంచి వర్షాలు పడే అవకాశం వుంది. వారం పదిరోజుల కిందటే అకాల వర్షాలతో దేశం యావత్తూ తడిసి ముద్దయింది. వేసవి తాపం నుంచి కాస్తంత ఉపశమనం దొరికింది. ఇప్పుడు నైరుతి రుతుపవనం కూడా వచ్చెయ్యడంతో.. మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి. జూన్ నెల రాకముందే రుతుపవన వానలు పలకరించడంతో గ్రీష్మతాపం నుంచి రిలీఫ్ దొరకబోతోంది. కానీ… ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షాలు మాత్రమే కురిసే వీలుందంటోంది వాతావరణ కేంద్రం.
భారత్‌లో రుతుపవనాల ఆగమనం ముందుగా కేరళ నుంచే మొదలవుతుందనే సంగతి తెలిసిందే. జూన్ 1 నుండి రుతుపవనాల కదలికలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయని వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. జూన్-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా సాదారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురసే అవకాశం ఉందని తెలిపింది.
రుతుపవనాల రాకతో కేరళతోపాటు తమిళనాడు, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.