మోదీ-జిన్‌పింగ్ భేటీ.. భారత్-చైనా సంబంధాలపై కీలక ప్రకటన

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకోనున్న నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్-చైనా మధ్య సహకారాన్ని పెంచుకోవడంతో పాటు, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను సక్రమంగా పరిష్కరించుకుంటామని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ తెలిపారు. గల్వాన్ ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

మోదీ-జిన్‌పింగ్ భేటీ.. భారత్-చైనా సంబంధాలపై కీలక ప్రకటన
PM Modi President Xi Jinping

Updated on: Sep 12, 2026 | 8:44 AM

భారత్-చైనా మధ్య సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చైనా భారత్‌లోని రాయబారి షూ ఫెయిహాంగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు.. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను సక్రమంగా పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు.

న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) సదస్సు నేపథ్యంలో షీ జిన్‌పింగ్ భారత్‌కు చేరుకోనున్న వేళ చైనా రాయబారి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనున్నట్లు కూడా ఆయన ధృవీకరించారు.

మోదీ-జిన్‌పింగ్ భేటీకి ఏర్పాట్లు

శుక్రవారం రాత్రి చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం కోసం ఇరు దేశాలు ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు కజాన్, టియాంజిన్‌లో జరిగిన సమావేశాల తర్వాత వరుసగా మూడో ఏడాది మోదీ-జిన్‌పింగ్ భేటీ కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం భారత్-చైనా సంబంధాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.

విభేదాలను పరిష్కరించుకుంటాం..

భారత్‌తో సంబంధాల విషయంలో చైనా దీర్ఘకాలిక, వ్యూహాత్మక దృక్పథంతో ముందుకు సాగాలని భావిస్తోందని షూ ఫెయిహాంగ్ వెల్లడించారు. ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని పెంచుకోవడంతో పాటు.. మరింతగా సంప్రదింపులు జరుపుకోవాలని ఆయన అన్నారు. అదే సమయంలో భారత్-చైనా మధ్య ఉన్న విభేదాలను కూడా సక్రమంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో స్నేహపూర్వక పొరుగుదేశ సంబంధాలను కొనసాగించడంతో పాటు.. ఒకరి విజయానికి మరొకరు భాగస్వాములుగా నిలవాలని చైనా కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

గల్వాన్ తర్వాత తొలిసారి భారత్‌లో జిన్‌పింగ్

2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొంతకాలం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు కొనసాగాయి. క్రమంగా సంబంధాల్లో కొంత మెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో కజాన్, టియాంజిన్‌లో ప్రధాని మోదీ, షీ జిన్‌పింగ్ భేటీలు జరిగాయి. ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

మూడో ఏడాది వరుసగా భేటీ

మోదీ-జిన్‌పింగ్ భేటీపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ కూడా స్పందించారు. కజాన్, టియాంజిన్ సమావేశాల తర్వాత వరుసగా మూడో ఏడాది ఇరు దేశాల నాయకులు సమావేశం కానున్నారని ఆమె తెలిపారు. ఇరు దేశాల అగ్రనేతల వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అమలు చేస్తూ.. ద్వైపాక్షిక సంబంధాలను దీర్ఘకాలిక, వ్యూహాత్మక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

షీ జిన్‌పింగ్ వెంట కీలక నేతలు

18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు షీ జిన్‌పింగ్ శనివారం బీజింగ్ నుంచి బయలుదేరారు. ఆయన వెంట చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ ఆఫీస్ డైరెక్టర్ కాయ్ కీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తదితరులు ఉన్నారు. షీ జిన్‌పింగ్ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది.

బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం

18వ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, దౌత్య, అంతర్జాతీయ సహకార అంశాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్ భేటీపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. సరిహద్దు సమస్యలు, ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పరస్పర సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత స్థిరపరిచేందుకు ఈ సమావేశం ఎంతవరకు దోహదపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us