దేశంలో ఫ్యామిలీ పార్టీల దుకాణాలు త్వరలో బంద్ అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాల్లో వేళ్ళూనుకుపోయిన కొన్ని కుటుంబ పార్టీలు.. దేశంలో సమగ్రతను దెబ్బతీస్తున్నాయని, స్థానిక ప్రయోజనాల కోసం దేశభక్తికి గండి కొడుతున్నాయని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ బిజెపి ఎంపీలు ముందుకు చేయడంతో మోదీ మాటలు టిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చేసినవేనని భావిస్తున్నారు.
పార్లమెంటు సమావేశాల చివరి రోజు కావడంతో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు అరవింద్, సంజయ్, బాపూరావు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. ముందుగా మోదీ, అమిత్‌షాలిద్దరు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన సిటిజన్‌షిప్ (అమెండ్‌మెంట్) బిల్లుకు టిఆర్ఎస్ మద్దతివ్వని విషయాన్ని మోదీ దృష్టికి తీసుకువెళ్ళగా.. ‘‘వాళ్ళకు లోకల్ ప్రయోజనాలే ముఖ్యం వాళ్ళు అలాగే చేస్తారు‘‘ అని మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఆ తర్వాత కేంద్రం నుంచి నిధులు రావడం లేదంటూ టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని బిజెపి ఎంపీలు మోదీకి వివరించగా.. ఉద్దేశ పూర్వక జాప్యం ఎక్కడా లేదని, ఫార్మాలిటీస్ ప్రకారమే నిధులు విడుదల అవుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికలకు ముందు ఏపీలో తెలుగుదేశం పార్టీ కూడా తమ ప్రభుత్వంపై ఇదే రకమైన ప్రచారం చేసిందని, చివరికి ఖంగుతిన్నదని మోదీ అన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా చర్చ కొన్ని కుటుంబాల ఆధ్వర్యంలో పనిచేస్తున్న పొలిటికల్ పార్టీలపై మళ్ళిందని, ఈ సందర్భంగానే మోదీ దేశంలో కొన్ని కుటుంబాలకు పరిమితమైన పార్టీలు త్వరలో అంతరిస్తాయని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి అనే అంశాన్ని ఇప్పుడు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.