వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రధాని మోధీ రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేశారు. ఇన్నోవేషన్, క్రీడలు, కళ, సంస్కృతి, సమాజసేవ, ధైర్యాసాహసాలు వంటి రంగాల్లో అసమాన తెగువను ప్రదర్శించిన 32 మంది బాల బాలికలకు ఈ అవార్డులు అందజేశారు. పురస్కారాలు గెలిచిన విద్యార్థులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ యేడాది కరోనా కష్టకాలంలో గెలుచుకున్న బాల పురస్కారాలు విశిష్టమైనవని ప్రధాని మోదీ తెలిపారు. స్వచ్ఛభారత్ లాంటి ఉద్యమంలో చిన్నారుల పాత్ర అమోఘమని తెలిపారు. కరోనా వేళ హ్యాండ్‌వాష్ లాంటి ప్రచారంతో ప్రజలకు చిన్నారులు చక్కటి అవగాహన కల్పించారని ప్రధాని మెచ్చుకున్నారు.
చిన్న ఐడియాకు సరైన సమయంలో సహకారం లభిస్తే, ఫలితం అద్భుతంగా ఉంటుందని ప్రధాని అన్నారు. చిన్నారులు తమ ఆలోచనలకు కార్యాచరణ తోడైతే మంచి ఫలితాలు లభిస్తాయిని నిరూపించారని చెప్పారు. పురస్కారాలతో సంతృప్తి చెందకుండా ఉత్తమ ఫలితాల కోసం మరింత కష్టపడాలని మార్గనిర్దేశం చేశారు. పిల్లలు మూడు వాగ్దానాలు చేయాలని, ఒకటి నిలకడగా ఉండాలని, రెండు దేశం కోసం పనిచేయాలని, మూడవది వినయంగా ఉండాలని ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీఇరానీ పాల్గొన్నారు.