ఫోన్ యాప్‌లో పాల ప్యాకెట్‌ ఆర్డర్‌ చేస్తే.. బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.18.5 లక్షలు హుష్‌!

Online Milk Packet Order Scam: నేటి కాలంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో దొరకడం.. క్షణాల్లో గుమ్మం ముందుకు వచ్చి చేరడంతో అందరూ ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌కి ఆసక్తి చూపుతున్నారు. ఈ అలవాటే ఇప్పుడు కొంపముంచుతుంది. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే హ్యాకర్లు నకిలీ వైబ్‌సైట్లు, యాప్‌లు తయారు చేసి.. జనాలను ఏమార్చి డబ్బు కాజేస్తున్నారు. తాజాగా ఓ ఆన్‌లైన్‌ యాప్‌లో పాల ప్యాకెట్‌ ఆర్డర్..

ఫోన్ యాప్‌లో పాల ప్యాకెట్‌ ఆర్డర్‌ చేస్తే.. బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.18.5 లక్షలు హుష్‌!
Online Milk Packet Order Scam

Updated on: Aug 17, 2025 | 5:21 PM

ముంబయి, ఆగస్ట్‌ 17: నేటి డిజిటల్ యుగంలో కిరాణా సామాగ్రి నుండి రోజువారీ నిత్యావసర వస్తువుల వరకు ప్రతిదానికీ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం సాధారణమై పోయింది. ప్రతిదీ ఆన్‌లైన్‌లో దొరకడం.. క్షణాల్లో గుమ్మం ముందుకు వచ్చి చేరడంతో అందరూ ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌కి ఆసక్తి చూపుతున్నారు. ఈ అలవాటే ఇప్పుడు కొంపముంచుతుంది. ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే హ్యాకర్లు నకిలీ వైబ్‌సైట్లు, యాప్‌లు తయారు చేసి.. జనాలను ఏమార్చి డబ్బు కాజేస్తున్నారు. తాజాగా ఓ ఆన్‌లైన్‌ యాప్‌లో పాల ప్యాకెట్‌ ఆర్డర్ చేసేందుకు యత్నించిన 71 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా రూ.18.5 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన ముంబయిలో ఆగస్ట్ 4వ తేదీన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ముంబైలోని వడాలాకు చెందిన వృద్ధురాలు ఈ నెల 4న ఓ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా లీటరు పాలు ఆర్డర్‌ చేసింది. అనంతరం కంపెనీ ఎగ్జిక్యూటివ్‌నంటూ దీపక్‌ అనే వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆర్డర్‌ను పూర్తిచేసేందుకు తాను పంపించిన లింకుపై క్లిక్‌ చేసి సూచనలను అనుసరించాలని తెలిపాడు. అతడి మాటలు గుడ్డిగా నమ్మిన వృద్ధురాలు సదరు లింక్‌పై క్లిక్‌ చేసి.. అతడు అడిగిన వివరాలు అన్నీ నమోదు చేసింది. దీంతో కేటుగాడి పన్నాగం పారింది. దీపక్‌ ఏకంగా గంటకు పైగా ఆమెను ఫోన్‌ కాల్‌లోనే ఉంచి.. దశల వారీగా ఆమెతో తనకు కావల్సిన వివరాలన్నీ పూరించుకున్నాడు. అయితే అంతసేపు ఫోన్‌ మాట్లాడటంతో విసిగిపోయిన ఆమె ఫోన్‌ కాల్‌ కట్ చేసింది.

ఆ మరుసటి రోజు దీపక్‌ మళ్లీ ఫోన్‌ చేసి మరిన్ని వివరాలు సేకరించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే వీద్ధురాలు బ్యాంకుకు వెళ్లగా తన ఖాతా నుంచి రూ.1.7 లక్షలు మాయమైనట్లు గ్రహించింది. మరో రెండు బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కూడా ఖాళీ అయినట్లు తెలిసింది. మొత్తంగా రూ.18.5 లక్షలు చోరీ అయినట్లు గుర్తించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సైబర్‌ పోలీసులు సదరు మహిళ నకిలీ లింక్‌పై క్లిక్‌ చేసినప్పుడే ఆమె ఫోన్‌ హ్యాక్‌ అయిందని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.