Government Offices: మణిపూర్‌లోని బీజేపీ (BJP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పని దినాలుగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే (ఐదు రోజులు) పని చేయనున్నాయి. వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను బీరెన్ (Biren Singh) ప్రభుత్వం ఐదు రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 22న సీఎం బీరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మణిపూర్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సునంద తోక్‌చోమ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒక్క వెకేషన్ డిపార్ట్‌మెంట్ మినహా అన్ని ఆఫీసులకు ఇదే నియమం వర్తించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆయా కార్యాలయల సమయంలో కూడా మార్పులు చేసినట్లు సెక్రటరీ తెలిపారు.
మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయనున్నాయి. శీతాకాలం నవంబర్-ఫిబ్రవరిలో అరగంట తగ్గించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయాలు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 1.30 గంటల వరకు భోజన విరామం ఉండనుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలు కూడా ఐదు రోజులు మాత్రమే తెరవనున్నారు. ఉదయం 8 గంటలకే పాఠశాలలు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు. అయితే, సెలవు దినాల్లో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఆయా విభాగాలు రోస్టర్ విధానాన్ని రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: