
ఏటీఎంలలో డబ్బు డిపాజిట్ చేస్తూ అనేక సంవత్సరాలుగా సుమారు రూ.50 లక్షలు దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ ఉద్యోగి కోసం పోలీసులు గాలిస్తున్న ఘటన చెన్నైలో వెలుగు చూసింది. తేనాంపేటలో ఉన్న ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం నగరంలోని బ్యాంకులకు నగదు నిర్వహణ, భద్రతా సేవలను అందిస్తుంది. అయితే అనుమానితుడు శంకర్ గత 12 సంవత్సరాలుగా ఇదే కంపెనీలో ATMలలో నగదు డిపాజిట్ చేసే టీంలో ఒకడిగా పనిచేస్తున్నాడు. అయితే నగదు డిపాజిట్ చేసిన ప్రతిసారి కొంత డబ్బును ఆ వ్యక్తి దొంగలించనట్టు ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇటీవల కంపెనీలో అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఈ అడిట్‌లో భాగంగా ATM లావాదేవీలలో కొన్ని వ్యత్యాసాలను అధికారులు గుర్తించారు. దీంతో ఈ అవకతవకలపై అంతర్గత దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న శంకర్ మనీ డిపాజిట్ చేసిన ప్రతిసారి కొంత డబ్బును దొంగలించి తన ఖాతాలోకి మళ్లించినట్టు ఈ దర్యాప్తులో కంపెనీ యాజమాన్యం గుర్తించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం నిందితుడు ఇప్పటి వరకు సుమారు రూ.50 లక్షల వరకు దుర్వినియోగానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.
విషయం బయటకు తెలియకుండా సాల్వ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అంతర్గత విచారణలో భాగంగా అనుమానితుడు శంకర్‌ను కంపెనీ యాజమాన్యం ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. ఏటీఎంలో డబ్బుల అవకతవకలపై అతన్ని ప్రశ్నించగా తాను చేసిన మోసాన్ని శంకర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా దొంగలించిన మొత్తాన్ని అతని తిరిగి ఇస్తానని కంపెనీకి హామీ ఇచ్చినట్టు సమాచారం.
అయితే డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చిన శంకర్ కొన్ని రోజుల తర్వాత విధులకు హాజరుకాలేదు.పైగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఈ శంకర్ పనిచేస్తున్న సంస్థ మేనేజర్ పాండి బజార్ పీఎస్‌లో శంకర్‌పై పోలీసు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు శంకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.