లక్నో, ఏప్రిల్ 6: ఎంతో చక్కగా సాగిపోతున్న వారి కాపురంలో అనుమానం పెనుభూతంగా మారింది. అంతే భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టిన సదరు పతి దేవుడు ఆమెను సోదరుడితో కలిసి గుట్టు చప్పుడుకాకుండా హతమార్చాడు. అనంతరం ఇంటి సమీపంలోని చెత్త కుప్ప దగ్గర ఆమె మృతదేహాన్ని పాతి పెట్టారు. ఎవరికీ తెలియదులే అని చేతులు దులిపేసుకున్నాడు. కానీ చేసిన పాపం వెంటాడుతుంది కదా.. ఇతడి విషయంలోనూ అదే జరిగింది. మహిళ మిస్సింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది జరిగిన ఏడాది తర్వాత మృతదేహం అవశేషాలు బయటపడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..
ఆసిఫా (28), కమీల్ భార్యాభర్తలు. అయితే భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన కమీల్ 2023 నవంబర్ 23న సోదరుడు ఆదిల్, అత్త చాందిని సాయంతో ఆసిఫా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతంర ఆమె మృతదేహాన్ని ఇంటి సమీపంలోని చెత్త కుప్ప సమీపంలో పాతి పెట్టాడు. అయితే తమ కుమార్తె ఆసిఫా కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పైగా అల్లుడు కమీల్ రెండేళ్లుగా తమతో మాట్లాడనీయడం లేదని, అతడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మార్చి 26న మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ భరత్ సోంకర్ తెలిపారు.
పోలీసులు ఆసిఫా భర్త కమీల్, అతడి సోదరుడిని విచారించేందుకు అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో ప్రశ్నించగా నిజం ఒప్పేసుకున్నారు. ఆసిఫాతో మరో వ్యక్తికి వివాహేతర సంబంధం ఉందని, అందుకే సోదరుడు ఆదిల్, అత్త చాందినితో కలిసి ఆమెను హత్య చేసి, పూడ్చిపెట్టినట్లు తెలిపారు. దీంతో శనివారం పోలీసులు వారి ఇంటి చెత్తకుప్ప వద్ద తవ్వగా ఆసీఫా అవశేషాలు కనిపించాయి. వాటిని సేకరించి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితురాలు చాందిని కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.