
బీహార్, జూన్ 22: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన భారీ మోసాన్ని బీహార్ పోలీసులు చేధించారు. బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో నిర్వహించిన దాడుల్లో నకిలీ అభ్యర్థులతో పరీక్షలు రాయించే ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 24 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో దేశంలోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలకు చెందిన మెడికల్ విద్యార్థులు కూడా ఉండటం కలకలం రేపుతోంది. జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-టెస్ట్ నిర్వహించిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి. పెద్ద మొత్తంలో అసలు అభ్యర్ధుల తరపున డబ్బు తీసుకుని ఇతరులు వైద్య ప్రవేశ పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్న ఒక మోసపూరిత ప్రాక్సీ పరీక్షల నెట్‌వర్క్‌ను దర్యాప్తు అధికారులు పట్టుకున్నారు. మోసపూరిత మార్గాల ద్వారా ప్రవేశాలు ఇప్పించడానికి ఒక్కో అభ్యర్ధి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు డీల్ కుదిరినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
అరెస్టు అయిన వారిలో పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH), గయా మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ రాయ్‌బరేలి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)కు చెందిన వైద్య విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పరీక్ష సమయంలో నిజమైన నీట్ (NEET) అభ్యర్థులుగా నటింపజేయడానికి ఈ విద్యార్థులను నియమించారని పోలీసులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల హసన్‌పూర్, కేఆర్‌కే ఉన్నత సెకండరీ పాఠశాల, లఖిసరాయ్‌లోని కేంద్రీయ విద్యాలయంతో సహా పలు పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన దాడులలో ఈ అరెస్టులు జరిగాయి. బయోమెట్రిక్ తనిఖీ సమయంలో లోపాలు ఉండవచ్చనే అనుమానంతో.. పలు పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ ధృవీకరణకు బాధ్యత వహించే ఏజెన్సీకి చెందిన 14 మంది ఉద్యోగులను కూడా పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్ వెనుక సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని కూడా దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. ఈ దాడుల సమయంలో పోలీసులు మొబైల్ ఫోన్‌లు, అనేక ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నెట్‌వర్క్.. ఇతర కేంద్రాలలో కూడా ఇలాంటి కార్యకలాపాలు జరిపాయా లేదా? అనే కోణంలో దర్యాప్తు పరిశీలిస్తోందని లఖిసరాయ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రేరణ కుమార్ తెలిపారు. ఈ రాకెట్‌కు సంబంధం మధ్యవర్తులను గుర్తించేందుకు అధికారులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నారు. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ నేపథ్యంలో ఆదివారం (జూన్ 2) నీట్ రీటెస్ట్ నిర్వహించారు. అన్ని అవాంతరాలు దాటుకుని పరీక్ష సజావుగా నిర్వహించామని ఎన్టీయే ఓపక్క ప్రగడ్భాలు పోతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం దేశ వ్యప్తంగా చర్చకు దారి తీసింది.
కాగా కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద పరీక్షలలో నీట్ రీ ఎగ్జాం ఒకటి. దేశంలోని 551 నగరాలు, 14 అంతర్జాతీయ ప్రదేశాలలో ఉన్న 5,440 కేంద్రాలలో ఈ పరీక్షకు 22 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించారు. అర్హత కలిగిన దివ్యాంగ అభ్యర్థులకు అదనపు సమయం కూడా కల్పించారు.