
బుధవారం (జనవరి 28, 2026) మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాద ఘటన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, NCP అధినేత అజిత్ పవార్ చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. ఈ విషాద ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ విమానాన్ని అనుభవజ్ఞుడైన పైలట్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ నడిపించగా, పింకీ మాలి విమాన సహాయకురాలుగా ఉన్నారు.
ఇది VSR వెంచర్స్ లియర్‌జెట్ 45 విమానం, రిజిస్ట్రేషన్ నంబర్ VT-SSK. ఈ విమానం మొత్తం బరువు 9752 కిలోగ్రాములు. శాంభవి పాఠక్ 2022 నుండి కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ముంబై విశ్వవిద్యాలయంలో విమానయానం అభ్యసించింది. ఆ తర్వాత ఆమె 2018 నుండి 2019 వరకు న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్స్ అకాడమీలో శిక్షణ పొందింది.
VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఢిల్లీలో ఉన్న ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ. ఇది 2011లో ఏర్పడింది. విమానాలను లీజుకు తీసుకోవడంతోపాటు, ఇది ఏవియేషన్ కన్సల్టెన్సీలో కూడా పాల్గొంటుంది. దీని యజమానులు కెప్టెన్ విజయ్ సింగ్, కెప్టెన్ రోహిత్ సింగ్. ఇదిలావుంటే, గతంలో సెప్టెంబర్ 14, 2023న, వారి విమానం ఒకటి ముంబై విమానాశ్రయంలో కూలిపోయింది.
తాజాగా బారామతి విమాన ప్రమాదం ఉదయం 8:45 మరియు 9:15 గంటల మధ్య జరిగింది. జిల్లా పరిషత్ ఎన్నికల కోసం బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ముంబై నుండి బారామతికి బయలుదేరారు. బారామతి రన్‌వేపై దిగడానికి ప్రయత్నిస్తుండగా, విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. రన్‌వేపై దిగడానికి బదులుగా, అది సమీపంలోని పొలంలో కూలిపోయింది. భూమిని ఢీకొన్న తరువాత, విమానం ముక్కలుగా విరిగి మంటలు చెలరేగాయి. మరణించిన ప్రయాణికులలో అజిత్ పవార్, విదిప్ జాదవ్ ఉన్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సహాయకుడు (PA), ఒక సెక్యూరిటీ ఆఫీసర్, ఇద్దరు పైలట్లు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని DGCA ధృవీకరించింది. విమానం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి గల కారణాలపై DGCA దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ప్రమాదంతో తర్వాత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..