
బుధవారం (జనవరి 28, 2026) ఉదయం మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించారు. ప్రమాద వార్త వ్యాపించిన వెంటనే, అనేక మంది ప్రముఖ మహారాష్ట్ర నాయకులు బారామతికి బయలుదేరారు. అహల్యాబాయి హోల్కర్ ఆసుపత్రికు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ప్రమాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మరణానికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆయనను ప్రజానాయకుడిగా అభివర్ణించారు. విమానం ల్యాండింగ్‌కు ముందే పేలిపోయిందని, ఆ తర్వాత మరో నాలుగు లేదా ఐదు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విమాన ప్రమాదం తర్వాత, NCP వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, NCP-SCP ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుటుంబసభ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, కుమారుడు పార్థ్ పవార్ ఢిల్లీ నుండి బారామతికి బయలుదేరారు.. ఎన్‌సిపి (శరద్ పవార్) నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణ వార్త విని భావోద్వేగానికి గురయ్యారు.
బారామతి విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన సంతాప సందేశంలో, “అజిత్ పవార్ బలమైన అట్టడుగు వర్గాల ప్రజా నాయకుడిగా కొనియాడారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందంజలో ఉన్న కష్టపడి పనిచేసే వ్యక్తిగా అభివర్ణించారు. పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే ఆయన అభిరుచి ప్రశంసనీయం. ఆయన అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికరమైనది, విచారకరం. ఆయన కుటుంబానికి, లెక్కలేనంత మంది అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.” అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Shri Ajit Pawar Ji was a leader of the people, having a strong grassroots level connect. He was widely respected as a hardworking personality at the forefront of serving the people of Maharashtra. His understanding of administrative matters and passion for empowering the poor and… pic.twitter.com/mdgwwGzw4R
— Narendra Modi (@narendramodi) January 28, 2026
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తోపాటు ఇతరుల మరణాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “బారామతిలో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదం నన్ను తీవ్రంగా బాధించింది. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు బలం, ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.
అజిత్ పవార్ మరణంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం వ్యక్తం చేశారు. “మొత్తం పవార్ కుటుంబానికి, అతని మద్దతుదారులకు మా సానుభూతి తెలియజేస్తున్నాము. నేను సుప్రియా సులే, అతని భార్యతో మాట్లాడాను” అని ప్రియాంక గాంధీ అన్నారు. అజిత్ పవార్ మరణంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. “మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన తోటి ప్రయాణికులు విమాన ప్రమాదంలో మరణించారనే వార్త చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో నేను మహారాష్ట్ర ప్రజలతో కలిసి ఉన్నాను. ఈ దుఃఖ సమయంలో మొత్తం పవార్ కుటుంబానికి, ప్రియమైనవారికి నా సంతాపం తెలియజేస్తున్నాను” అని రాహుల్ అన్నారు.
బారామతిలో విమానం కూలిపోయిన సంఘటన స్థలంలోని ప్రత్యక్ష సాక్షి ఒకరు ప్రమాద తీరును వివరించారు. “విమాన ప్రమాదాన్ని నా కళ్ళతో చూశాను. ఇది నిజంగా చాలా బాధాకరం. విమానం ప్రయాణిస్తున్నప్పుడు, అది కూలిపోతుందేమో అనిపించింది, అనుకున్నట్లే జరిగింది. అప్పుడు ఒక పెద్ద పేలుడు సంభవించింది. ఆ తర్వాత, మేము ఇక్కడికి పరిగెత్తే సరికి విమానం మంటల్లో చిక్కుకుంది. విమానంలో మరో 4-5 పేలుళ్లు జరిగాయి. స్థానికులు ఇక్కడికి వచ్చి విమానంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ మంటలు చాలా పెద్దవిగా ఉన్నాయి. మేము సహాయం చేయలేకపోయాము. అజిత్ పవార్ విమానంలో ఉన్నట్లు గుర్తించాము. అతను చనిపోయిన తీరు మాటల్లో వ్యక్తపరచలేను. విమాన ప్రమాదంలో జరిగిన పేలుడు ధాటికి రెండు మృతదేహాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి. మేము అజిత్ పవార్‌ను అతని అద్దాలు, గడియారం ద్వారా గుర్తించి బయటకు తీశాము.” అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బారామతి విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు చేపట్టింది. బ్యూరో నుండి ఒక బృందం త్వరలో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుంది. ఈ సంఘటనకు గల కారణాన్ని విశ్లేస్తామని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..