ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం.. ఏకంగా మరో రాష్ట్ర సీఎంనే ఫాలో అయ్యేలా చేసింది. అంతేకాదు.. దేశం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోంది. మహిళలపై అత్యాచారాలను నిరోధించే క్రమంలో భాగంగా.. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ యాక్ట్‌ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ‘దిశ పోలీస్ స్టేషన్’లను కూడా ప్రారంభించారు.
అత్యాచార కేసుల్లో నిందితులకు 21 రోజుల్లోనే మరణ శిక్షలు విధించేందుకు నిర్థేశించిన దిశ చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా దిశ యాక్ట్‌ని తీసుకొచ్చే విధంగా.. ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే దృష్టి సారించారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించారు. మార్చి 30వ తేదీ లోపు నివేదిక అందజేయాలని సీఎం వారిని ఆదేశించినట్టు హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన దిశ చట్టాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని దేశ్ ముఖ్ గతంలో చెప్పారు. దిశ చట్టాన్ని.. మహిళలు, పిల్లలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించడానికి, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష పడే విధంగా రూపొందించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే.. ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు పరిచేలా ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం.