Lockdown: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను నివారించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. లాక్‌డౌన్ వద్దనుకుంటే కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన హెచ్చరికల నేపథ్‌యంలో బీఎంసీ ఆరు ప్రత్యామ్నాయాలు సూచించింది.
1. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది సంఖ్యను 15న రోజులకు 50 శాతం తగ్గించాలి
2. అత్యవసరంగా పనికి వెళ్తే వారినే లోకల్‌రైళ్లలో ప్రయాణం చేసే విధంగా అనుమతించాలి
3. వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి
4. లోకల్ రైళ్ల టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసివేయాలి. ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. అలాగే నెలవారీ పాస్‌లు జారీ చేయడాన్ని నిషేధించాలి.
5. షాపుల పని వేళల్లో మార్పులు చేయాలి. సరి బేసి తేదీల ప్రకారం దుకాణాలు తెరిచి ఉంచాలి.
6. వసై-విరార్, కల్యాణి-డోంబివిలి, అంబర్‌నాథ్, బద్లాపూర్, కసారా, కర్జత్, పాల్ఘర్, నవీముంబై నంచి ముంబై వరకు స్టేట్ ట్రాన్స్ పోర్టు బస్సులను ఎక్కువగా నడిపించి లోక్ రైళ్ల భారాన్ని తగ్గించాలి.
ఇక రైళ్లల్లో, కార్యాలయాల్లో, మార్కెట్లలో విపరీతమైన జనం ఉండటం కారణంగానే కరోనా వ్యాప్తి అధికంగా పెరిగిపోతోందని, అందువల్ల లోక్ రైళ్లల్లో పెరిగిన రద్దీ వల్లే కరోనా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. అయితే సుదీర్ఘ కాలంలో లోకల్ రైళ్లను రద్దు చేయడం వల్ల ఉపాధి కోల్పోయి జనాలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే లోక్ రైళ్లు ప్రారంభించడంతో జనాల్లో ఆనందంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ విధించి లోకల్ రైళ్ల సేవలను రద్దు చేయడం అంతా సరైనది కాకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆరు ప్రత్యామ్నాయ మార్గాలతో ముందుకొచ్చింది. అయితే ఈ ప్రతిపాదన రైల్వే బోర్డుకు పంపించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తామని బీఎంసీ ఇక్బాల్ సింగ్ చహల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 80 శాతం కరోనా రోగుల్లో లక్షణాలు ఏవి కనిపించకపోవడంతో ప్రమాదంగా మారుతోందని, రాబోయే రెండు వారాల్లో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్ననారు.
కాగా, కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేర్ సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరోసారి కరోనా సెంటర్లు తెరుచుకున్నాయి. అయితే కరోనా సెంటర్లలో మొత్తం 70,135 పడకలు ఉండగా, వాటిలో ప్రస్తుతం కేవలం 13,135 పడకలపై రోగులు చికిత్సను పొందుతున్నారు. 9,757 పడకలను రిజర్వ్ చేసి ఉంచారు. కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల అధిక శాతం కరోనా కేర్ సెంటర్లను మూసివేశారు. అయితే ఏడు జంబో కరోనా సెంటర్లను, ప్రతి విభాగంలో ఒకటి చొప్పున స్థానికంగా మొత్తం 24 కరోనా సెంటర్లను మాత్రం మార్చి 31 వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు.
ప్రస్తుతం రోగుల సంఖ్య పెరగడంతో 30 శాతం పడకలు నిండిపోయాయి. దీంతో మూసివేసిన కరోనా సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలని బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బాధితుల మెడికల్ రిపోర్టు 24 గంటల్లో కార్పొరేషన్‌కు తెలియజేయడం, రిపోర్టులన్నింటిని సంబంధిత విభాగంలో వెంటనే అప్‌లోడ్ చేయడం అనివార్యం చేశారు. రోగుల చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకోవాలనీ, ఐసీయూ పడకలు, అక్సిజన్ పడకలు, అంబులెన్స్‌లు, సిబ్బందిని, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాలను సిద్ధంగా ఉంచాలనీ అన్ని విభాగాల్లోని డిప్యూటీ కమిషనర్‌లకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు.