Maharashtra Coronavirus : మహారాష్ట్రలో కరోనా మరింత విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 60 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా.. 281 మంది చనిపోయారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన ప్రభుత్వం.. మే 1 వరకు కర్ఫ్యూ తరహా నిబంధనలను అమలు పరుస్తామని స్పష్టం చేసింది. కోవిడ్ కట్టడి విధుల్లో ఉన్న పోలీసులు కూడా మరోమారు వైరస్ బారిన పడుతున్నారు. ముంబైలో వారం రోజుల్లో ఏకంగా 279 మంది పోలీసులకు వైరస్ సోకింది. ఇప్పటివరకు 8 వేల మంది పోలీసులు కరోనా బారిన పడగా.. అందులో 101 మందిని మహమ్మారి మింగేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా నేటి రాత్రి నుంచి అత్యంత కట్టుదిట్టంగా పూర్తి స్థాయి కర్ఫ్యూ తరహాలో 144 సెక్షన్ అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి అత్యంత కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తారు. అయితే, దీనిని లాక్‌డౌన్ అనబోనని సీఎం చెబుతున్నారు. అత్యవసర సేవలు మినహా అన్ని వర్తక, ఉద్యోగ, వాణిజ్య కార్యకలాపాలు స్థంభింప చేస్తారు. లోకల్ ట్రైన్, బస్ సర్వీసులను అత్యవసర సేవలకు మాత్రమే ఉపయోగించాలని సీఎం సూచించారు. అయితే, పెట్రోలు బంకులు, సెబీ అనుబంధంగా పనిచేసే ఆర్థిక సంస్థలు పనిచేస్తాయని.. నిర్మాణ పనులు కొనసాగించుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.
ఇక, హోటళ్లు, రెస్టారెంట్లకు కేవలం టేక్ అవేలకు మాత్రమే అనుమతి ఉంటుంది. హోం డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు, ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 17,960, ఛత్తీస్‌గఢ్‌లో 15,001, ఢిల్లీలో 13,005, కర్నాటకలో 9 వేలకు చేరువలో కేసులు రికార్డయ్యాయి. ఇండియాలో ఏడాది కాలంలో ఎప్పుడూ లేనంతగా కరోనా కేసులు ప్రస్తుతం వెలుగు చూస్తుండగా.. అంతే స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు భారత్‌లోనే నమోదవుతున్నాయి.
Read also : Nara Lokesh : ‘లోకేష్ ఇక్కడ.., జగన్ ఎక్కడ..?’, ఇక్కడికి రండి… ఏపీ సీఎం జగన్ కు నారా లోకేష్ ఛాలెంజ్