
మధ్యప్రదేశ్ లో తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో చూపిన ఉత్సాహం.. ప్రస్తుతం కరోనా ను నివారించడంలో జాప్యానికి దారి తీసిందని ఈ రాష్ట్ర మాజీ సీఎం కమల్ నాథ్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. ఈ వైరస్ ని కంట్రోల్ చేయడానికి ముందే చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని కరోనా కేసులు నమోదై ఉండేవి కావన్నారు. ఆదివారం భోపాల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘దొడ్డి దారిన బీజేపీ’ అధికారం చేజిక్కించుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో 532 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకగా.. 36 మంది కరోనా రోగులు మరణించారు.శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ఇప్పటివరకు హోమ్, హెల్త్ శాఖలకు మంత్రులను నియమించలేకపోయిందని కమల్ నాథ్ ఎద్దేవా చేశారు. కోవిడ్ అదుపులో ఈ శాఖల మంత్రులు కృషి చేసి ఉండేవారేమో అన్నారాయన. గత నెలలో 22 మంది మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోలేని పరిస్థితిలో కమల్ నాథ్ రాజీనామా చేశారు.బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్ళీ సీఎం అయ్యారు.