సాధారణంగా ఒక గొర్రె ధర రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఉంటుంది. లేదంటే ఇంకొద్దిగా ధర ఎక్కువగా ఉంటుంది. కానీ మాడ్గల్ జాతికి చెందిన గొర్రె ధర వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇది చాలా అరుదైన జాతి గొర్రె. దీని మాంసానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ వ్యక్తి ఈ అరుదైన జాతి గొర్రెను రూ. 70 లక్షలు పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ ఆ గొర్రెను అమ్మేందుకు దాని యజమాని అంగీకరించలేదు. సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామం ఈ జాతి గొర్రెలకు చాలా ప్రసిద్ది. ఈ గొర్రె యజమాని బాబు మెట్కారికి సాంగ్లీ జిల్లాలోని మాడ్గల్ గ్రామంలో సుమారు 200 వరకు గొర్రెలున్నాయి. అయితే ఈ మాడ్గల్ జాతి గొర్రెను రూ.70 లక్షలు పెట్టి కొనేందుకు ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిందని చెప్పుకొచ్చాడు. కానీ దానిని అమ్మడం ఇష్టం లేదని గొర్రె యజమాని తెలిపాడు. ఆ గొర్రె అసలు పేరు షార్జా అని, దానికి మోదీ అని నామకరణం చేశామని తెలిపాడు.
అయితే మాడ్గల్ గొర్రె కూడా అన్ని మార్కెట్లలో తన డిమాండ్‌ను పెంచుకుంటుందని ఆ పేరు పెట్టినట్లు చెప్పాడు. అంతేకాకుండా ఆ గొర్రె నా కుటుంబానికి ఎంతో అదృష్టం.. ఎట్టి పరిస్థితుల్లో అమ్మబోనని స్పష్టం చేశాడు. కాగా, గొర్రెను కొనుగోలు చేసేందుకు రూ.70 లక్షలకుపైగా ఆఫర్ చేశాడని, కానీ తాను రూ.కోటీ 50 లక్షలకు మాత్రమే అమ్ముతానని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఓ గొర్రెను కొనుగోలు చేసేందుకు అంత ఖర్చు పెట్టరనే ఉద్దేశంతో అమాంతంగా ధరను పెంచినట్లు గొర్రె యజమాని పేర్కొన్నాడు. ఆ గొర్రెను అమ్మడం ఇష్టం లేకనే అంత ధరను పెంచినట్లు చెప్పాడు.