కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గర్జించాయి కేంద్ర కార్మిక సంఘాలు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ సమరశంఖాన్ని పూరించాయి. ప్రైవేటీకరణ , సంస్కరణలు, గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలు, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 48 గంటల భారత్ బంద్‌కు(Bharat Bandh) పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుంచే భారత్ బంద్ కు కదం తొక్కాయి కేంద్ర కార్మిక సంఘాలు. రోడ్‌వేస్, రవాణా, విద్యుత్తు, బ్యాంకింగ్, బీమా రంగాలకు చెందిన సిబ్బంది బంద్‌లో పాల్గొన్నాయి. హర్యానా, చండీగఢ్‌లలో ESMA అమలు చేస్తామని బెదిరింపులు చేసినప్పటికి సమ్మెలో పాల్గొన్నాయి కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష, కార్మికసంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ముద్దిలపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వాహనాలను అడ్డుకున్నారు.
బస్టాండ్ ల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్ వద్ద తెల్లవారుజాము నుంచే ఆందోళనలు చేపట్టారు. ఎవడురా కొనేది..ఎవడురా అమ్మేది అంటూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
48 గంటల దేశవ్యాప్త కార్మిక సమ్మెకు తెలంగాణలో కార్మిక సంఘాలు కదంతొక్కాయి. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణపై సింగరేణిలో కార్మికులు సమ్మెకు దిగారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించారు. దీంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు తెలంగాణలో క్యాబ్‌లు, ఆటోల సంఘాలు భారత్ బంద్ కు మద్దతు పలికాయి. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం ముందు యూనియన్ నేతలు, డ్రైవర్లతో ధర్నా కు దిగారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
బ్యాంకు ఉద్యోగులతో పాటు ఉక్కు, చమురు, టెలికం, బొగ్గు, పోస్టల్, ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన 48 గంటల సమ్మెలో పాల్గొన్నాయి. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కలిపి మొత్తం 20 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా బంద్ లో పాల్గొంది. ఫలితంగా రెండు రోజులు బ్యాంకుల సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోనున్నాయి. దీని ఫలితంగా ఇవాళ, రేపు సేవలకు అంతరాయం ఏర్పడవచ్చని ఎస్బీఐ సహా అనేక బ్యాంకులు తెలిపాయి.
ఇవి కూడా చదవండి: Yadadri Temple: మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్ ..
BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..