Allahabad HC grants bail to Ashish Mishra: ఉత్తర ప్రదేశ్‌లో మొదటి దశ పోలింగ్ రోజున కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ ఖేరి (Lakhimpur Kheri) లో జరిగిన హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra) కు బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి.. రిమాండ్‌కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు తాజాగా గురువారం బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3న కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో రైతుల మీదుగా వాహనాలు దూసుకెళ్లడంతో నలుగురు రైతులతోపాటు కారు డ్రైవర్, జర్నలిస్టు, మరో ఇద్దరు కలిపి మొత్తం 8 మంది మృతి చెందారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడనే అభియోగంపై అక్టోబర్ 9వ తేదీన అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి చార్జిషీట్ దాఖలు చేసింది.
కాగా.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ రావడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదేం వ్యవస్థ.. నలుగురు రైతుల్ని చంపిన నేతకు నాలుగు నెలల్లోనే బెయిల్ రావడమేంటని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ సింగ్ చౌదరి. ఇదే విషయంలో ప్రధానిని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు ప్రియాంక. ఇకపై అతడు స్వేచ్ఛగా తిరుగుతాడన్నారు ప్రియాంక. ఆశిష్ మిశ్రా కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లనే ఈజీగా బెయిల్ వచ్చిందని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆవర్గం ఓట్ల కోసమే ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇచ్చారంటూ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఆరోపించారు.
Also Read: