Viral Video: చేసిందే పాడు పని.. పైగా ఓవరాక్షన్.. ఈ ఇన్‌స్పెక్టర్ మామూలోడు కాదు సామీ.. వీడియో వైరల్..

రక్షణ కల్పించాల్సిన ఖాకీ అధికారి.. లంచం రుచి మరిగాడు. చిట్ ఫండ్ కేసులో చిక్కుకున్న బాధితుడిని బెదిరించి లక్షల్లో బేరం పెట్టాడు. కానీ సీన్ కట్ చేస్తే.. లోకాయుక్త పోలీసులు వేసిన పక్కా స్కెచ్‌తో ఆ ఇన్‌స్పెక్టర్ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. బెంగళూరులోని సిరాసి సర్కిల్ వద్ద సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Viral Video: చేసిందే పాడు పని.. పైగా ఓవరాక్షన్.. ఈ ఇన్‌స్పెక్టర్ మామూలోడు కాదు సామీ.. వీడియో వైరల్..
Inspector Govindaraj Bribery Case

Updated on: Jan 31, 2026 | 1:18 PM

కర్ణాటకలో అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు లోకాయుక్త పోలీసులు దూకుడు పెంచారు. చిట్ ఫండ్ కేసులో నిందితులకు సహకరించేందుకు ఏకంగా రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేసిన కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజును లోకాయుక్త పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ ఘటన మైసూర్ రోడ్డులోని సిరాసి సర్కిల్ సమీపంలో కలకలం రేపింది. మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తిపై చిట్ ఫండ్‌కు సంబంధించి ఒక కేసు నమోదైంది. ఈ కేసులో అక్బర్, అతని స్నేహితులకు సహాయం చేసేందుకు అలాగే వారిపై మరిన్ని కఠినమైన కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇప్పటికే ముందస్తుగా రూ.1 లక్షను వసూలు చేసిన ఇన్‌స్పెక్టర్, మిగిలిన రూ.4 లక్షల కోసం బాధితుడిపై ఒత్తిడి తెచ్చారు.

సినిమా ఫక్కీలో ట్రాప్

డబ్బులు ఇచ్చుకోలేని బాధితుడు లోకాయుక్త పోలీసులను ఆశ్రయించాడు. లోకాయుక్త ఎస్పీ శివప్రకాష్ దేవరాజు నేతృత్వంలో అధికారులు పక్కా ప్లాన్ వేశారు. చామరాజేపేటలోని CAR గ్రౌండ్ సమీపంలో డబ్బులు ఇచ్చేందుకు అక్బర్ వెళ్లగా అక్కడ కాపుకాసిన లోకాయుక్త అధికారులు, ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు రూ. 4 లక్షలు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ‘‘గోవిందరాజు అనే ఇన్‌స్పెక్టర్ బాధితుడిని బెదిరించి లంచం డిమాండ్ చేశాడు. సిరాసి సర్కిల్ దగ్గర డబ్బులు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఈ కేసులో ఇంకా ఎవరైనా అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం” అని ఎస్పీ తెలిపారు.

ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్ గోవిందరాజును అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారే లంచం తీసుకుంటూ దొరకడం ఇప్పుడు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.