Five New Judges: కొలీజియం సిఫారసు చేసిన ఈ ఐదుగురు కొత్త న్యాయమూర్తుల గురించి మీకు తెలుసా.. వీరంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు..

|

Feb 05, 2023 | 10:06 AM

సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన సంజయ్ కరోల్ నవంబర్ 2019 నుండి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. గతంలో ఆయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Five New Judges: కొలీజియం సిఫారసు చేసిన ఈ ఐదుగురు కొత్త న్యాయమూర్తుల గురించి మీకు తెలుసా.. వీరంతా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు..
Five New Judges Appointed In Supreme Court
Follow us on

సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. నియమితులైన న్యాయమూర్తులు ఫిబ్రవరి 6న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం అనంతరం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరనుంది. ఈ న్యాయమూర్తుల పేర్లను గతేడాది డిసెంబర్ 13న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జస్టిస్ మనోజ్ మిశ్రా. ఈ ఐదుగురు న్యాయమూర్తుల గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం.

జస్టిస్ పంకజ్ మిట్టల్

ప్రస్తుతం జస్టిస్ పంకజ్ మిట్టల్ రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. దీనికి ముందు జమ్ముకశ్మీర్, లడఖ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందకముందు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ మిట్టల్ 1985లో ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో చేరారు. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

జస్టిస్ సంజయ్ కరోల్

జస్టిస్ సంజయ్ కరోల్ నవంబర్ 2019 నుండి పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. గతంలో ఆయన త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు. జస్టిస్ కరోల్ 1986 సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.

జస్టిస్ పివి సంజయ్ కుమార్

న్యాయమూర్తి PV సంజయ్ కుమార్, 2021 సంవత్సరం నుంచి మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకు ముందు పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. జస్టిస్ పివి కుమార్ ఆగస్టు 1988లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో సభ్యునిగా నమోదు చేసుకున్నారు.

జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా

ప్రస్తుతం జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2011లో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది.. 2021లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత జూన్ 2022లో పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ అమానుల్లా సెప్టెంబర్ 1991లో బీహార్ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు.

జస్టిస్ మనోజ్ మిశ్రా

ప్రస్తుతం జస్టిస్ మనోజ్ సిన్హా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 2011లో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మిశ్రా డిసెంబరు 12, 1988న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. అలహాబాద్ హైకోర్టులో సివిల్, రెవెన్యూ, క్రిమినల్, రాజ్యాంగ పక్షాలలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం