యాక్షన్ సినిమాను తలపించేలా పోలీసుల వేట.. చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్

ఖలిస్థానీ సానుభూతిపరుడు వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ నేత అయినటువంటి అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్‌ పోలీసులు భారీఎత్తున వేట మొదలుపెట్టారు.

యాక్షన్ సినిమాను తలపించేలా పోలీసుల వేట.. చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్ పాల్ సింగ్
Amritpal Singh

Updated on: Mar 19, 2023 | 11:21 AM

ఖలిస్థానీ సానుభూతిపరుడు వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ నేత అయినటువంటి అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్‌ పోలీసులు భారీఎత్తున వేట మొదలుపెట్టారు. దాదాపు 100 కార్లతో అమృత్‌పాల్‌ ముఠాను వెంబడించారు. అయితే అతను చిక్కినట్టే చిక్కి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటివరకు 78 మంది ఖలిస్థాన్‌ సానుభూతిపరులను అరెస్టు చేశారు. భారీస్థాయిలో ఆయుధాలనూ స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగింది. నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారిలేక లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది.

అయితే అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలతో అమృత్‌పాల్‌పై కేసు నమోదైంది. శనివారం జలంధర్‌లోని షాకోట్‌కు అతడు వస్తున్నట్లు సమాచారం అందింది. ప్రణాళిక ప్రకారం అమృత్‌పాల్‌, అతడి అనుచరులను అరెస్ట్‌ చేసేందుకు జలంధర్‌, మొగా పోలీసుల బృందం సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టింది. అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని తెలియగానే అమృత్‌పాల్‌ పారిపోయాడు. దీంతో పోలీసులు 78 మంది అనుచరులను అరెస్టు చేశారు. ఈ అరెస్టుల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తకుండా పంజాబ్‌ వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపి వేస్తూ రాష్ట్ర హోం వ్యవహారాలు, న్యాయ శాఖ నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్‌, మొబైల్‌ రీఛార్జి మినహా మిగిలిన మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను నిలిపివేయాలని ఆదేశించింది. మరోవైపు అమృత్ పాల్ సింగ్ కు పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఏజేన్సీ అయిన ఐఎస్ఐ, ఇతర ఉగ్రవాద సంస్థలతో దగ్గరి సంబధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి