సినిమా స్టోరీని మించిన క్రైమ్ స్కెచ్.. కేతన్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు..

ఆమెతో కలిసి ఏడడుగులు నడవాలనుకున్నాడు. తనతో జీవితాంతం సంతోషంగా బతకాలనుకున్నాడు.. కానీ ఆమె మరోలా ఆలోచించింది. కాబోయే భర్తనే కడతేర్చింది. మహారాష్ట్రలో జరిగిన కేతన్ హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు, ఆమె ప్రియుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు.

సినిమా స్టోరీని మించిన క్రైమ్ స్కెచ్.. కేతన్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు..
Big Twist In Ketan Agrawal Case

Updated on: Jun 26, 2026 | 10:50 AM

ఈ మధ్యకాలంలో పెళ్లి అంటేనే భయపడే పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే వివాహేతర సంబంధాలతో ఎంతో మంది భర్తలను కడతేరుస్తున్నారు కట్టుకున్న భార్యలు. అయితే పెళ్లి చేసుకోకముందే కాబోయే భర్త ప్రాణం తీయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మహారాష్ట్రలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అతని కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను పోలీసులు అరెస్ట్ చేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితులు ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కేతన్‌ను వదిలించుకోవడానికి చేతనే ఈ ప్లాన్ వేశాడని సియా చెప్తుండగా… సియా ఒత్తిడి వల్లే తాను ఈ హత్యకు సహకరించానని చేతన్ వాదిస్తున్నాడు. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం ఈ కుట్ర మొత్తానికి సియా గోయల్ ప్రాధాన సూత్రధారి అని పోలీసులు స్పష్టం చేశారు.

విఫలమైన మొదటి ప్రయత్నం..

పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం.. కేతన్ అగర్వాల్‌కు ట్రెకింగ్ అంటే చాలా ఇష్టం. ఈ బలహీనతనే సియా తన ప్లాన్‌కు ఆయుధంగా వాడుకుంది. మే 31న కేతన్‌తో కలిసి సియా లోహగఢ్ కోటకు వెళ్లింది. అక్కడ వించు కాటా రిడ్జ్ వద్ద హత్య చేయడానికి అనువైన లోతైన ప్రదేశాన్ని గుర్తించింది. జూన్ 4న రెండోసారి అతడిని అక్కడికి తీసుకెళ్లాలని చూసినా, కేతన్ తల్లి అభ్యంతరం చెప్పడంతో ఆ ప్లాన్ సాగలేదు. జూన్ 14న ఎలాగైనా పథకం అమలు చేయాలని కేతన్‌ను మళ్లీ కోటకు తీసుకెళ్లి కొండపై నుండి కిందకు తోసేయడానికి సియా ప్రయత్నించింది. కానీ అదృష్టవశాత్తూ కేతన్ ఒక పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అది కేవలం ప్రమాదవశాత్తు జరిగిందేనని నమ్మించి సియా మళ్లీ అతని నమ్మకాన్ని పొందింది.
జూన్ 18న అంటే కేవలం నాలుగు రోజుల తర్వాత సియా తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను మళ్లీ అదే కోటకు తీసుకెళ్లింది. ఈసారి ఇద్దరూ కలిసి కేతన్‌ను 350 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసి, ఘాతుకానికి పాల్పడ్డారు.

పక్కా స్కెచ్.. దొరికిపోయిన నిందితులు

ఈ ఘోరానికి పాల్పడే ముందు నిందితులు సినిమా ఫక్కీలో ప్లాన్ చేశారు. జూన్ 18న చేతన్ తన స్వంత మొబైల్ ఫోన్‌ను తన షాపులోనే వదిలేసి, పోలీసులకు దొరకకుండా ఉండటానికి తన ఉద్యోగి ఫోన్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లాడు. అయితే ఈ విషయాన్ని సదరు ఉద్యోగి పోలీసుల విచారణలో అంగీకరించాడు. అలాగే మే 31 నుండి జూన్ 4 మధ్య సియా, చేతన్ ఇద్దరూ పుణెలోని ఒక కేఫ్‌లో కలిసి కుట్ర పన్నినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలను పోలీసులు సేకరించారు.

పెళ్లి ఇష్టం లేదన్నా వినలేదు..

సియా గోయల్ మాత్రం కథ వేరేలా చెప్తుంది. పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పినా.. కేతన్ వినిపించుకోలేదని ఆరోపిస్తుంది. నిశ్చితార్థం రద్దు చేసుకోవాలని కోరినా ససేమీరా అన్నాడని పోలిసుకు చెప్పినట్లు సమాచారం. ఈ కారణంతోనే అతడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు తన కూతురు తప్పు చేసినట్లు తేలితే ఉరి తీయాలని సియా తల్లిదండ్రులు అన్నారు. కాగా కేసు దర్యాప్తులో భాగంగా పుణె రూరల్ పోలీసులు నిందితురాలు సియా గోయల్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి క్రైమ్ సీన్‌ను రీ క్రియేట్ చేశారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటన స్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరించింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

Follow Us