Kerala Elections: కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మెట్రోమాన్‌ శ్రీధరన్‌ ముఖ్యమంత్రి అవుతారా?

|

Feb 23, 2021 | 4:14 PM

మొన్నామధ్య రాజస్థాన్‌లోని పురాణబస్‌ గ్రామానికి జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్యాదేవి సర్పంచ్‌గా గెలిచారు.. సర్పంచ్‌ అయిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు కూడా నెలకొల్పారు..

Kerala Elections: కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? మెట్రోమాన్‌ శ్రీధరన్‌ ముఖ్యమంత్రి అవుతారా?
Follow us on

Kerala Elections:  మొన్నామధ్య రాజస్థాన్‌లోని పురాణబస్‌ గ్రామానికి జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్యాదేవి సర్పంచ్‌గా గెలిచారు.. సర్పంచ్‌ అయిన అతి పెద్ద వయస్కురాలిగా రికార్డు కూడా నెలకొల్పారు. మరో మూడేళ్లలో సెంచరీ మార్క్‌ దాటుతున్న ఆమె ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉన్నారు..ఈ వయసులో నలుగురికి సేవ చేయాలన్న తపన ఉండటం మంచిదే! ఆమె ఉత్సాహాన్ని కూడా ఎవరూ కాదనరు.. మెట్రోమాన్‌గా పేరు గడించిన 88 ఏళ్ల శ్రీధరన్‌కు కూడా ఇంచుమించు ఇలాంటి కోరికే ఉంది.. ఆ పద్మవిభూషణుడికి కేరళను పాలించాలని ఉందట! ముఖ్యమంత్రి పదవిని చేపట్టి రాష్ట్రాన్ని మెట్రో అంత వేగంగా పరుగులు పెట్టించాలని ఉందట! కలలు కనండని పాపం కలాంగారు పదే పదే చెబుతూ ఉండేవారు.. శ్రీధరన్‌ కల మాత్రం చాలా పెద్దది.. మరో రెండు మాసాల్లో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికారంలోకి వస్తే కనుక తానే ముఖ్యమంత్రి పదవిని చేపడతానని, కేరళను అప్పుల ఊబి నుంచి బయటపడేస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతానంటూ మెట్రోమాన్‌ నొక్కి వక్కాణించారు..ఈ వయసులోని వారు ఏ గవర్నర్‌ పదవినో ఆశిస్తారు కానీ శ్రీధరన్‌ మాత్రం సీఎం పదవి తప్ప మరోటి పుచ్చుకోనే ప్రసక్తే లేదనేశారు.

ఆ మాత్రం అభిలాష ఉండాల్సిందే.. అయితే కేరళలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయా? కనీసం పది పదిహేను అసెంబ్లీ స్థానాల్లోనైనా గెలుస్తుందా? అన్న సందేహాలు కలిగి తీరతాయి! ఎందుకంటే కేరళలో కమలం ఇంకా విచ్చుకోలేదు కాబట్టి! ఇప్పుడిప్పుడే మొగ్గలు తొడుగుతున్న ఆ పార్టీ విజయం సాధించడమన్నది అంత ఈజీ కాదు.. ఇదే మాట ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ దగ్గర అంటే మాత్రం సీరియస్సవుతున్నారు.. రాజకీయ పరిణామాలు మారడానికి ఏళ్లకు ఏళ్లు పట్టనక్కర్లేదని, కొన్ని సందర్భాలలో చటుక్కుమని మారతాయని అంటున్నారు.. ఒకప్పుడు కర్నాటకలో తమకు రెండంటే రెండే సీట్లు ఉండేవని, త్రిపురలోనైతే ఒక్కటి కూడా ఉండేది కాదని, ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలలో అధికారంలో రాలేదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు సురేంద్రన్‌.. ప్రస్తుతం తమకు 16 శాతం ఓటింగ్‌ ఉందని, అది 30 శాతానికి చేరుకోవడం పెద్ద కష్టమైన పని కాదన్నారు. ‘ప్రజలు ఎల్‌డీఎఫ్‌ పాలన చూశారు, యూడీఎఫ్‌ పాలన చూశారు. ఈ రెండు కూటములు ప్రజలకు పెద్దగా చేసిందేమి లేదు..దేవస్థానం బోర్డులను కలుషితం చేశారు పాలకులు.. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నారు. లవ్‌ జిహాద్‌లను ప్రోత్సహిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే కేరళ అభివృద్ధి చెందుతున్నదే తప్ప ఇక్కడివారు చేసిందేమీ లేదు’ అని సురేంద్రన్‌ చెప్పుకొచ్చారు. శబరిమల వివాదంపై యూడీఎఫ్‌, ఎల్‌డీఎఫ్‌లు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని విమర్శించారు. కేరళ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయాలన్నదే బీజేపీ ధ్యేయమని అన్నారు. తాము అధికారంలోకి రావడం, శ్రీధరన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ కొండంత విశ్వాసాన్ని ప్రదర్శించారు సురేంద్రన్‌..

ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వం దృష్టంతా పశ్చిమ బెంగాల్‌, కేరళలపై ఉంది. బెంగాల్‌లో పాతుకుపోవాలని, కేరళలో పాగా వేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీకి చెందిన అతిరథమహారథులందరూ ఎన్నికల ప్రచారపు బరిలో దిగుతున్నారు. ఆల్‌రెడీ అమిత్‌ షా రెండుమూడు సార్లు బెంగాల్‌ను చుట్టేసి వచ్చారు. కేరళలో మొన్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ పర్యటించారు. ప్రస్తుత ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్‌పై కూడా విమర్శలు సంధించారు.. యోగీ కూడా తన ప్రసంగాలలో లవ్‌ జిహాద్‌, ఉగ్రవాద సంస్థలనే ప్రస్తావించారు. శబరిమల భక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆటలాడుకుందని విమర్శించారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధరన్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందని, ఆయన బీజేపీలో చేరడం వల్ల ఆ పార్టీకి ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌ ఇప్పటికే ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు కూడా! అక్కడక్కడ అరకొర ఉన్న బీజేపీ అధికారం కోసం అర్రులు చాస్తుందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ ఇప్పుడు బలపడిందని తాను భావించడం లేదన్నారు శశి థరూర్‌.. టెక్నోక్రాట్‌గా శ్రీధరన్‌ అంటే గౌరవం ఉంది కానీ, ఆయన రాజకీయాల్లో రాణిస్తారని అనుకోవడం లేదన్నారు. 53 ఏళ్ల వయసులో తాను రాజకీయాల్లోకి వచ్చానని, అంత ఆలస్యంగా వచ్చినందుకు కొంచెం బాధపడ్డానని, అలాంటిది 88 ఏళ్ల శ్రీధరన్‌ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధిస్తారన్నదే తెలియడం లేదన్నారు థరూర్‌.

శశిథరూర్‌ అనడం కాదు కానీ, రెండు నెలల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇదే రుజువు చేశాయి. కనీసం ఏడు వేల వార్డులలో గెలుద్దామనుకున్న బీజేపీకి కేవలం రెండు వేల వార్డులే దక్కాయి.. 2015 ఎన్నికలతో పోలిస్తే ఇవి మెరుగైన ఫలితాలే కానీ అధికారాన్ని కట్టబెట్టంత కావు.. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌పై కాషాయపు జెండాను ఎగరేయడం కోసం బీజేపీ ఎంతగానో కష్టపడింది.. కానీ ఫలించలేదు.. 40 గ్రామపంచాయతీలను, పది మునిసిపాలిటీలను దక్కించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన బిజేపీని నిరాశే ఎదురయ్యింది. పాలక్కాడ్‌, పందలన్‌ మునిసిపాలిటీలను మాత్రమే దక్కించుకోగలిగింది. తమను ఓడించడానికి ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌లు చేతులు కలిపాయని ఓటమికి సాకులు చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండు మూడు స్థానాలు వస్తే అది తిరువనంతపురం జిల్లా నుంచి మాత్రమే! ఎందుకంటే ఆ పార్టీ ఉనికి ఉన్నది అక్కడే.. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది కూడా ఈ జిల్లాలోని నెమమ్‌ నియోజకవర్గం నుంచే! ఈసారి కడక్కూటమ్‌, వట్టియుకావు నియోజకవర్గాలపై కూడా కన్నేసింది. ప్రముఖ సినీ నటుడు సురేశ్‌గోపిని బరిలో దించే ప్రయత్నాలు చేస్తున్నది.. మరి బీజేపీ ఆశలు, ఆశయాలు ఎంత వరకు ఫలిస్తాయో చూద్దాం!