కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దార్వాడ్ సమీపంలోని ఓ లోయలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్కూల్ బస్సు పడింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది విద్యార్ధులు, 11 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్సు అద్దాల్ని పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీస్తున్నారు.. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఘటనపై అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.