Coronavirus: మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్ మహమ్మారి.. ఒకేరోజు మూడు మరణాలు..

|

Dec 26, 2023 | 9:49 PM

మళ్లీ కరోనా వచ్చింది.. వచ్చీరాగానే రెచ్చిపోనూ పోతోంది.. కొవిడ్ మహమ్మారి. దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది కొత్త వేరియంట్ జెఎన్‌-1. నానాటికీ రోజువారీ కేసులు పెరగడం, మరణాలు నమోదవడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతానికి మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్టాలు కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా. మరి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..

Coronavirus: మళ్లీ కోరలు చాస్తున్న కొవిడ్ మహమ్మారి.. ఒకేరోజు మూడు మరణాలు..
Coronavirus
Follow us on

మళ్లీ కరోనా వచ్చింది.. వచ్చీరాగానే రెచ్చిపోనూ పోతోంది.. కొవిడ్ మహమ్మారి. దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది కొత్త వేరియంట్ జెఎన్‌-1. నానాటికీ రోజువారీ కేసులు పెరగడం, మరణాలు నమోదవడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతానికి మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్టాలు కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా. మరి.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి.. ఇక్కడ కూడా మృత్యుఘంటికలు మోగిస్తోందా? న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో కేంద్రం ఏమని హెచ్చరిస్తోంది? కొన్ని రోజుల కిందట రోజువారీ కొవిడ్ కేసులు వందలోపే ఉండేవి. ఇప్పుడు వందలు దాటుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్ దాటేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ముగ్గురు మృత్యువాతన పడ్డారు. ఈ ముగ్గురూ కర్నాటక వాసులే. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4170కి చేరినట్టు ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ..

తెలుగు రాష్ట్రాల్లో సైతం అలారమ్ మోగించింది కొవిడ్ మహమ్మారి. హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా తాండవం షురూ ఐంది. ఇద్దరు కరోనా రోగులు మృత్యువాతన పడ్డారు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. కానీ.. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై రివ్యూ చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ.. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎవరూ మృతిచెందలేదని ప్రకటించారు.

ఏపీలో.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం సాధారణ అలర్ట్‌తోనే సరిపెట్టడం, పైగా శీతాకాలం కావడం.. కొవిడ్ లక్షణాలతో రోగులు ఆస్పత్రి బాట పడుతున్నారు. శ్వాససంబంధిత సమస్యలతో ఈనెల 24న వైజాగ్ కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ మృత్యువాతన పడింది. ఈ సీజన్‌లో ఏపీలో తొలి కొవిడ్ మరణం నమోదైనట్టు ప్రచారం జరగడంతో జనంలో వణుకు మొదలైంది.

యూపీ, కేరళలో జేఎన్‌-1 వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని ఆదేశించింది కేంద్రం. ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కరోనా మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.

కొత్త వేరియంట్ JN-1 దూకుడుని చూసి అప్రమత్తమైంది ఢిల్లీ ఆరోగ్య శాఖ. అంత ప్రమాదకరం కాదని చెబుతూనే కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్ని సమాయత్తం చేస్తోంది. ఈ వేరియంట్ రెండు రూపాలతో వ్యాపిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని దరికి చేరకుండా ఆపొచ్చు.. అని ప్రకటించారు డిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌. కర్నాటక ఆరోగ్యమంత్రి దినేష్ గుండూరాం క్యాబినెట్ సబ్‌కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి.. బెంగళూరులో కొవిడ్ నివారణ చర్యలపై సమీక్షించారు.

సెలబ్రిటీల్ని వణికిస్తోంది కొవిడ్ కొత్త వేరియంట్. మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి ధనుంజయ్ ముండేకి కొవిడ్ సోకినట్టు ప్రకటించింది ప్రభుత్వం. ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజున ఆయన ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది. వెంటనే ఐసొలేషన్‌కి తరలించి… ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఆయన ఛాంబర్‌లో మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో కార్పొరేట్ సెక్టార్‌ కూడా ఎటెన్షన్‌ మోడ్‌లోకొచ్చింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టెక్ మహీంద్రా తమతమ కార్యాలయాల్ని వైరస్-ఫ్రీ జోన్లుగా మార్చేశాయి. అటు.. తమ ఉద్యోగులు వైరస్ బారిన పడకుండా ‘ఫ్లెక్సిబుల్ వర్క్ ప్లేస్’ విధానాన్ని అమలు చేస్తోంది ఐటీ దిగ్గజం విప్రో. ఉద్యోగులకు వారానికి మూడురోజులు మాత్రమే ఆఫీసుకు వచ్చేలా వెసులుబాటు కల్పించాం.. ఆ మూడు రోజుల్లో కూడా ప్రొఫెషనల్‌గా ఇబ్బంది లేకుండా, ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సరికొత్త వర్క్‌ప్లేస్‌ని ఏర్పాటు చెయ్యబోతోంది విప్రో సంస్థ.

కొత్త వేరియంట్ కేసుల పెరుగుదలతో కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ దిశగా ఆలోచన జరుగుతోంది. మళ్లీ మూడేళ్ల కిందటి చేదు జ్ఞాపకాలు రిపీటౌతాయా అనే భయం కూడా జనంలో వెంటాడుతోంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..