
26 ఏళ్ల పరశురాం అనే ఓ ఖైదీ కర్నాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. అతను మార్చి 28న తనకు కడుపులో నొప్పిగా ఉందంటూ అధికారులకు తెలిపారు. జైలు ఆవరణలోని ఆస్పత్రిలో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కొన్ని మెడిసిన్స్ ఇచ్చి పెయిన్ తగ్గిపోతుందని చెప్పారు. కొంతసేపటి తర్వాత నొప్పితో విలవిల్లాడిపోవడంతో… అతడిని మెక్‌గన్ టీచింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ప్రశ్నించగా.. రాయిని మింగినట్లు పరుశురాం సమాధానమిచ్చాడు. నొప్పి దాని వల్లే అయి ఉంటుందని.. రాయి మలం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అతడికి కొన్ని మందులు ఇచ్చి పంపించేశారు.
మళ్లీ ఏప్రిల్ 1న పరశురాం పరిస్థితి విషమించడంతో, వైద్యులు అతనికి ప్రత్యేక చికిత్స అవసరమని జైలు అధికారులకు సూచించారు. ఏప్రిల్ 6న బెంగుళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించగా, ఏప్రిల్ 25న… 75 నిమిషాల పాటు ఆపరేషన్ చేసి పరశురాం కడుపులో నుంచి మొబైల్ ఫోన్ తొలగించారు డాక్టర్లు. అతను మింగింది రాయి కాదని.. సెల్‌ఫోన్ అని డాక్టర్లకు అర్థమైంది. ఇదే విషయాన్ని జైలు అధికారులకు తెలిపారు. అతను మింగిన చైనీస్ మొబైల్ ఫోన్ చాలా చిన్నదని, అది గొంతు, అన్నవాహిక గుండా వెళ్లిందని డాక్టర్ చెప్పారు. “ఇది మలం నుంచి బయటకు వస్తుందని మేము అనుకున్నాము. పరశురామ్ కూడా దానిని మింగినప్పుడు కూడా అలాగే భావించి ఉండవచ్చు. అయితే, ఫోన్ లోపల పైలోరస్‌లో ఇరుక్కుపోయింది” అని డాక్టర్ చెప్పారు. సర్జరీ అనంతరం పరశురామ్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచి, ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించడంతో తిరిగి శివమొగ్గ జైలుకు తరలించారు.
జైలులో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ కలిగి ఉన్నందుకు కర్ణాటక ప్రిజన్స్ (సవరణ) చట్టం – 2022లోని సెక్షన్ 42 కింద శివమొగ్గలోని తుంగానగర్ పోలీసులు పరశురామ్‌పై కేసు నమోదు చేశారు. కాగా పరుశురాం సీక్రెట్‌గా మొబైల్ ఫోన్‌ను జైలుకు తెప్పించి ఉండవచ్చని.. తనిఖీలు చేస్తున్న సమయంలో భయంతో దాన్ని మింగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకునేందుకు ఇదో ఎత్తుగడ కూడా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత విచారణ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇకపై జైలులో ఖైదీలతో ములాఖత్ అయ్యేందుకు వచ్చేవారిని.. క్షుణ్ణంగా తనీఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ వంటి వాటిని తనిఖీ చేయడానికి జైలు లోపల సెర్చ్ ఆపరేషన్లు సాధారణంగా జరగుతూ ఉంటాయి. అయితే, చాలామంది వాటిని టాయిలెట్లలో లేదా ఎవరూ తనిఖీ చేయని ఇతర ప్రదేశాలలో దాచిపెడతారు. కానీ పరశురామ్ దానిని మింగేశాడు” అని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..