
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు కాంగ్రెస్ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. సోనియా విదేశాల నుంచి తిరిగొచ్చాక ఈ వ్యవహారంపై తేల్చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. డీకే శివకుమార్ మాత్రం సీఎం పదవి కోసం అన్ని ఎత్తులు వేస్తున్నారు.
కర్ణాటకలో సీఎం పదవి కోసం సిద్దరామయ్య , డీకే శివకుమార్ మధ్య పోటీ మరింత ముదిరింది. ఈసారి ముఖ్యమంత్రి కాకుంటే ఎప్పటికి సీఎం కాలేనన్న ఆలోచనలో డీకే శివకుమార్ ఉన్నారు. అందుకే హైకమాండ్ మీద గతంలో ఎన్నడు లేని విధంగా ఒత్తిడి పెంచారు. డీకే వర్గానికి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో క్యాంప్ వేశారు . ఆయన కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకుంటున్నారు. హైకమాండ్ ముందు బలప్రదర్శనకు సిద్దమవుతున్నారు.
వొక్కలిగ సామాజిక వర్గం నేతలు కూడా డీకే శివకుమార్‌ను సీఎం చేయలని ఒత్తిడి పెంచారు. పలువురు స్వామీజీలు డీకేతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో డీకే సీఎం కావాలని పలు చోట్ల ఆయన అభిమానులు యాగాలు చేశారు. ఆధిపత్య పోరు ముదిరన వేళ ఒకే వేదికపై కన్పించారు సిద్దరామయ్య, డీకే శివకుమార్. సిద్దరామయ్య ముందే సోనియాగాంధీ త్యాగం గురించి ప్రస్తావించారు డీకే శివకుమార్. మన్మోహన్ లాంటి నేతను సోనియా ప్రధాని చేశారని, ఆమె ఎంతో త్యాగం చేశారని అన్నారు. ప్రధాని పదవిని సోనియా తిరస్కరించారని అన్నారు. తాను కుల రాజకీయాలకు దూరమని, కాంగ్రెస్ కుటుంబమే తన కుటుంబమన్నారు. ‘‘కులరాజకీయాలకు నేను వ్యతిరేకం.. నాది కాంగ్రెస్ కులం. నా కులంవాళ్లు నన్ను ఇష్టపడవచ్చు. అన్ని వర్గాల వాళ్లను నేను ప్రేమిస్తా.. బీసీలు, ఎస్సీలు , ఎస్టీలు,మైనారిటీలు అంతా నావాళ్లే.. వొక్కలిగలు కూడా బీసీలే. ముంబై పర్యటనపై తప్పుడు వార్తలు రాయరాదు. అనారోగ్యంతో ఉన్న నా మిత్రుడిని కలిసేందుకే వెళ్లా.’’ అని అన్నారు.
అయితే కర్ణాటక పదవిపై సోనియాగాంధీ తిరిగి వచ్చిన తరువాతే కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే వీరప్ప మొయిలీ లాంటి నేతలు హైకమాండ్ తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిపై నాన్చుడు ధోరణితోనే గొడవ ముదిరిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..