Karnataka Election Result: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. టాప్-9 న్యూస్ అప్‌డేట్స్

arnataka Results Day: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరగ్గా.. ఇవాళ ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఆ రాష్ట్రంలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వం ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోనుంది.

Karnataka Election Result: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. టాప్-9 న్యూస్ అప్‌డేట్స్
Karnataka Election Results

Updated on: May 13, 2023 | 8:20 AM

Karnataka Results Day: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరగ్గా.. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఆ రాష్ట్రంలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వం ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అక్కడి కన్నడ ప్రజలే కాదు.. అటు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

  1. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరగగా…36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను పెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ అమలులో ఉంది.
  2. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కన్నడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలుతోంది. తిరిగి అధికారం సాధించే దిశగా బీజేపీ…ఎలాగైనా కమలాన్ని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం పార్టీ కష్టపడింది. కింగ్ మేకర్ కావాలని జేడీఎస్ ఉవ్విళ్లూరుతోంది.
  3. దక్షిణాదిన బీజేపీ ఉనికి ఉన్న ఏకైన రాష్ట్రం కర్ణాటకనే. కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రం కూడా ఇదే. ఈసారి రికార్డుస్థాయిలో 73.19 శాతం పోలింగ్‌ నమోదు కావడంతో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రానుంది.
  4. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. హంగ్ ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించవచ్చని అంచనావేయగా.. కొన్ని సర్వేలు బీజేపీయే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనావేశాయి.
  5. కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే జేడీఎస్‌ మరోసారి కింగ్‌మేకర్‌గా మారనుంది. జేడీఎస్ గతంలో మాదిరే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా లేక బీజేపీకి మద్దుతునిస్తుందా అనేది ఉత్కంఠను పెంచుతోంది. ఎన్నికల అనంతర పొత్తులు అనివార్యమైతే జేడీఎస్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ పెద్దలు జేడీఎస్ అధినేతలతో తెరచాటు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
  6. సిఎం బస్వరాజు బొమ్మై షిగ్గాన్‌ నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ దిగ్గజాలు సిద్ద రామయ్య వరుణ నుంచి, డీ.కే. శివకుమార్‌ కనకపుర, మాజీ సిఎం జగదీష్‌ షెట్టర్‌ హుబ్లి ధార్వాడ్ సెంట్రల్‌ నుంచి బరిలో దిగారు. జేడీఎస్ నేత, మాజీ సిఎం కుమారస్వామి చెన్నపట్టణనుంచి పోటీ చేయగా…గంగావతి నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి నుంచి ఆయన భార్య అరుణ బరిలో నిలిచారు.
  7. గతంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను శాసించిన గాలి జనార్దన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లోను తన సత్తా ఏంటో చూపాలని వేగంగా పావులు కదిపారు. గెలుపే ధ్యేయంగా ఎత్తులు వేశారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించి..పార్టీ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి నిలిపారు.
  8. కర్ణాటకలో తెలుగు వాళ్లు ఎక్కువగా నివాసముండే ప్రాంతాల్లో టాలీవుడ్‌ నటులు ప్రచారం చేశారు. సాయికుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి అక్కడ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయో వేచి చూడాల్సిందే. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
  9. మరోవైపు కర్నాటక ఎన్నికల ఫలితాల పై బెట్టింగ్‌ల జోరు కొనసాగుతోంది. ఫలితాలపై పక్కా అంచనాతో ఉన్న బెట్టింగ్‌ రాయుళ్లు , తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులోని పట్టణాల్లో తిష్టవేశారు. ఏకంగా క్యాష్‌ పట్టుకుని బహిరంగంగా బెట్టింగ్‌కి దిగారు. రూ.10వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది.

మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..