కన్నడ రాజకీయ సంక్షోభం క్షణక్షణం మారుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు రాజీనామా చేసిన 13 మంది రెబల్ ఎమ్మెల్యేలు ముంబై నుంచి గోవాకు మకాం మార్చారు. వీరంతా రెండ్రోజుల కిందట రాజీనామా చేసి ముంబయి వెళ్లడం తెలిసిందే. అయితే, ముంబయిలో వీరు బసచేసిన సోఫిటెల్ హోటల్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రాలు, సూట్ కేసులతో విభిన్నతరహాలో ప్రదర్శన నిర్వహించారు. దానికితోడు, కర్ణాటక కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ అసంతృప్త నేతలతో చర్చించేందుకు ముంబయి బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఇంకా ముంబయిలోనే ఉంటే తమకు ఇబ్బంది తప్పదని భావించిన కాంగ్రెస్, జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గోవా పయనం అయినట్టు సమాచారం.
మరోవైపు జేడీఎస్ నేతలు తమ ఎమ్మెల్యేల శిబిరాన్ని బెంగళూరు తాజ్ వెస్ట్ హోటల్ నుంచి దేవనహళ్లికి తరలించారు. దీంతో ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సంక్షోభం నుంచి బయటపడేందుకు అగ్రనాయకులు రంగంలోకి దిగారు.