Karnataka Assembly Poll Results 2023 Highlights in Telugu: అందరిచూపు.. కన్నడ రాజ్యం వైపే.. నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. కన్నడ భవితవ్యం తేలిపోయింది. ఉదయం నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాలతో విజయం సాధించింది. ఇక బీజేపీ 65, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాలతో సరిపెట్టుకున్నారు. కర్నాటక తీర్పు ఎలా ఉండబోతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమవుతాయి. కాగా, కర్నాటకలో మే 10న.. 224 స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 73.19శాతం పోలింగ్ నమోదైంది. 113 మేజిక్ ఫిగర్.. ఓట్ల లెక్కింపు కోసం స్టేట్ వైడ్‌గా 34 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంఅయింది. భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ కొనసాగింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారీ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ గెలుపుపై కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. విజయానికి కాదు.. విజయం సాధించిన తీరుకు అభినందనలు తెలిపారు. మహాత్మాగాంధీలా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని అన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. విజయంపై మోడీ అభినందనలు తె లియజేశారు. కర్ణాటక అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.
I thank all those who have supported us in the Karnataka elections. I appreciate the hardwork of BJP Karyakartas. We shall serve Karnataka with even more vigour in the times to come.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
కర్ణాటక ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఆయన 13,638 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి ఆయన వరుసగా మూడోసారి విజయం సాధించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇక సీఎం అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి పేరుతో అందరి ఏకాభిప్రాయాన్ని హైకమాండ్ ముందు ఉంచుతామని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది.
కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ అన్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ లలో రాబోయే అన్ని ఎన్నికలలో బీజేపీకి ఇదే విధంగా గుణపాఠం ఉంటుందని వ్యాఖ్యానించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో 136 సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు..బీజేపీ 65 స్థానాలకే పరిమితమైంది. ఇక జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాలతో సరిపెట్టుకున్నారు.
బీజేపీ ప్రభుత్వ దుష్టపాలనతో ప్రజలు విసిగిపోయారని మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. నేను మానవతావాదిని, కుల వ్యతిరేకిని కాదు. నన్ను లింగాయత్ వ్యతిరేకిగా చిత్రీకరించబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
జేడీఎస్‌కు కంచుకోటగా ఉన్న మైసూర్‌లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న జేడీఎస్ ఆశకు నిరాశ ఎదురైంది. కుమారస్వామి సన్నిహితుడు మహేష్ ఘోర పరాజయాన్ని చవిచూశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇక కనకపురా స్థానం నుంచి గెలుపొందిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎన్నికల అధికారుల నుంచి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. తనపై నమ్మకం ఉంచి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కర్ణాటక ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా కర్ణాటకలో ప్రధాని మోడీపై విపరీతమైన అభిమానం చూపారని, కానీ స్థానికంగా ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు అనుకూలంగా పని చేసిందన్నారు. తాము కొన్ని పొరపాట్లు చేశామని, కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధిస్తామన్నారు. కనీసం 80 శాతం వరకు కర్ణాటకలో సీట్లను సాధిస్తామన్నారు. ఇక్కడ చేసిన పొరపాట్ల కారణంగా తెలంగాణలో కూడా మాకు వ్యతిరేకత ఉంటుందని కొందరు భావిస్తున్నారని, మాకేంటే బీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఎన్నో పొరపాట్లు చేస్తోందని అన్నారు. బీఆర్‌ఎస్ పొరపాట్ల కారణంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో పార్టీని గెలిపిస్తానని సోనియాగాంధీకి మాట ఇచ్చానని అన్నారు. కర్ణాటకలో పార్టీని విజయం వరించేలా చేస్తానని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేకు మాట ఇచ్చానని అన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఏ మాత్రం చూపబోదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేరళ స్టోరీ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలను ఆకట్టుకోవడంలో ఎలా విఫలమైందో.. అదే విధంగా కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని మంత్రి ట్వీట్ చేశారు.
హైదరాబాద్, బెంగళూరుల మధ్య ఆరోగ్యకర పోటీ నెలకొనాలని ఆకాంక్షించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే రేపు తెలంగాణలో పునరావృతమవుతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Just the way Kerala Story failed to amuse people of Karnataka, similarly Karnataka election results will have NO bearing on Telangana
Thanks to the people of Karnataka for rejecting ugly & divisive politics ?
Let Hyderabad and Bengaluru compete healthily for investments &…
— KTR (@KTRBRS) May 13, 2023
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చిందని, గత వారం రోజులుగా ఇదే చెబుతున్నానని అని మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ హుబ్లీలో అన్నారు. కాంగ్రెస్‌ను ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నాకు గెలవాలని లేదు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాను. నన్ను ఓడించడమే కాదు, రాష్ట్రం మొత్తం బీజేపీని ఓడించారు. నన్ను టార్గెట్ చేసిన వారే రాష్ట్రంలో బీజేపీని ఓడించారని అన్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. దీంతో రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు తెలిపారు. బలవంతులపై బలహీనులు సాధించిన విజయం ఇదని అన్నారు. పేదల తరపున కాంగ్రెస్ పోరాడిందని, విద్వేష రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు. తాము ప్రేమతో గెలిచామని, ఇది కర్ణాటక ప్రజల విజయమని రాహుల్ అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి ఓటమిపాలయ్యారు. రామనగర స్థానం నుంచి ఆయన జేడీఎస్ టికెట్‌పై పోటీ చేశారు.
కర్ణాటక ఎన్నికల్లో తమ ఓటమికి అనేక కారణాలున్నాయి. దీనిపై లోతుగా చర్చిస్తామని బీజేపీ నేత బసవరాజ బొమ్మై అన్నారు. తప్పులను సరిదిద్దుకుని సమర్థ ప్రతిపక్షంగా పనిచేస్తామన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 224 సీట్లకు గాను 113 సీట్లు గెలుచుకుంది. మరో 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇక కొప్పళ గంగావతిలో కేఆర్పీపీ అభ్యర్థి నర్ధనరెడ్డి విజయం సాధించారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 113 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో 20కిపైగా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
ప్రజాస్వామ్యానిదే విజయమని మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. అధికారం, డబ్బు ప్రభావం పని చేయలేదని, బీజేపీ దృష్టంతా కర్ణాటక మీదే పెట్టిందన్నారు. సీఎం అభ్యర్థిని అధిష్టానమే నిర్ణయిస్తుందని ఖర్గే అన్నారు.
ఇది సెక్యులర్ పార్టీ విజయమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కర్ణాటక ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టారు’ అని పేర్కొన్నారు. బీజేపీ అవినీతిని సమర్థంగా ఎండగట్టారని పేర్కొంటూ.. పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ విజయం గెలుపొందారు. ఆయన చిత్తాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. 136 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 64, జేడీఎస్ 20, ఇతరులు 2, కేఆర్పీపీ 1, ఎస్కేపీ 1 స్థానంలో లీడ్ లో కొనసాగుతోంది.
కర్నాటకలో గాలి జనార్ధన్‌రెడ్డి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఏర్పాటు చేసిన KRPP అభ్యర్థులు 15 చోట్ల ఓటమి పాలయ్యారు. బళ్లారి నుంచి పోటీ చేసిన గాలి జనార్ధన రెడ్డి భార్య లక్ష్మీ అరుణ, హరప్పణ హళి నుంచి పోటీ చేసిన సోదరుడు కరుణాకర్ రెడ్డి కూడా ఓడిపోయారు. కానీ గంగావతి స్థానం నుంచి పోటీ చేసిన గాలి జనార్ధన రెడ్డి 2 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
హంగ్ ఏర్పడితే మరోసారి కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్ ఆశలు నీరు గారిపోయాయి. ఒక దశలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాకపోతే చక్రం తిప్పాలని భావించిన బీజేపీ…కుమారస్వామిని సంప్రదించింది. జేడీఎస్‌ను కలుపుకున్నా అధికారం దక్కే అవకాశాలు లేకపోవడంతో కమలనాథులు ఆ ప్రయత్నాలను పక్కన పెట్టారు. చెన్నపట్టణలో కుమారస్వామి విజయం సాధించారు
చావోరేవోగా భావించిన కర్నాటక ఎన్నికల ఫలితాలతో ఆ రాష్ట్రానికి చెందిన AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు పెద్ద ఊరట దక్కింది. కర్నాటక ప్రజల మూడ్ ను బట్టి ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహం మార్చారు. ఏ అంశాలు ప్రజలపై ప్రభావం చూపుతాయి ఏంటని ఆలోచించారు ఖర్గే. కర్నాటకలో వరుసగా తొమ్మిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పిన చరిత్ర ఖర్గేకు ఉంది. అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఓసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ అనుభవానికి తోడు AICC అధ్యక్షుడిగా ఇప్పుడు అసలు సిసలు పరీక్షను సమర్ధవంతంగా పూర్తి చేశారు ఖర్గే
కర్నాటకలో స్పష్టమైన ఆధిక్యతను సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి 134 సీట్లు రాగా, బీజేపీ 65 సీట్లకే పరిమితమైపోయింది. జేడీఎస్‌కు కేవలం 21 దక్కాయి. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ విజయంతో దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు.. ఢిల్లీతో పాటు బెంగళూరులోని కాంగ్రెస్ కార్యాలయాల్లో కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. సిమ్లాలోని హనుమాన్ టెంపుల్‌లో ప్రియాంక గాంధీ పూజలు జరిపారు
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. 132 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సీఎం అభ్యర్థి పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. సిద్ధరామయ్య, డీకే శివ కుమార్.. ఇద్దరిలో ఎవరో ఒకరు సీఎంగా ఎన్నిక కానున్నారు. అయితే, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థులకు టచ్ లో ఉంటూనే.. అర్జెంటుగా బెంగళూరు రావాలంటూ పార్టీ అధిష్టానం సూచనలు చేసింది.
గెలిచిన ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించేందుకు కర్ణాటక కాంగ్రెస్ సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమిళనాడుకు తరలించే అవకాశం ఉంది. తమిళనాడులోని హోటళ్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బసకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. 15 హెలికాప్టర్ల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొంటున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో చీఫ్ కాంగ్రెస్ డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కర్ణాటకలో అతిపెద్ద విజయానికి కారణమైన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలందరిది అని పేర్కొన్నారు.
మీరే సీఎం అంటూ మీ మద్దతుదారులు కోరుకుంటున్నారంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు డీకే శివకుమార్ స్పందించారు. తనకంటూ మద్దతుదారులెవరూ లేరని.. కాంగ్రెస్ పార్టీ మొత్తం మద్దతుగా ఉందంటూ పేర్కొన్నారు.
కేఆర్పీపీ చీఫ్ గాలి జనార్థన్ రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు. రెండు వేలకు పైగా మెజారిటీ గాలి జనార్థన్ రెడ్డి గెలుపొందారు.
కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య గెలుపొందారు. అదేవిధంగా గాలి జనార్ధన్ రెడ్డి గెలుపొందారు. చిత్తాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక్ ఖర్గే 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బస్వరాజ్ బొమ్మై గెలుపొందారు.
బీజేపీకి రాజీనామా చేసి.. హుబ్లీ- ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్ షెట్టర్ ఓటమి పాలయ్యారు. మాజీ ముఖ్యమంత్రి అయిన షెట్టర్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.
మంత్రి, బీజేపీ నేత శ్రీరాములు ఓటమి..
బళ్లారి (ఎస్‌టీ) స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి, మంత్రి శ్రీరాములు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర ఆయనపై విజయం సాధించారు. శ్రీరాములు గతంలో.. ఐదు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు.
కనకపురా నుంచి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు. అనంతరం, కఆయన మై టీమ్ అంటూ ఓ చిత్రాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.
My Team ?#KarnatakaElectionResults2023 pic.twitter.com/gj0DX8C0TV
— DK Shivakumar (@DKShivakumar) May 13, 2023
కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు.. కాంగ్రెస్ వైపు స్పష్టమైన తీర్పు ఇస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలి.. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడంటూ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినా కర్ణాటకలో బీజేపీకి ఎలాంటి లాభం ఉండదని చెప్పాం. ఇప్పుడు ఇదే జరిగింది. మేం 120 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాం.. మెజారిటీ సాధిస్తామనే నమ్మకముందంటూ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ప్రియాంక గాంధీ సిమ్లాలోని హనుమాన్ టెంపుల్ లో పూజలు చేశారు.
భారత్ జోడోయాత్ర తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది.. అంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇప్పటివరకు ఆరు స్థానాల్లో గెలుపొందింది.
కనకపురా నుంచి డీకే శివకుమార్ విజయం సాధించారు.
చల్లకెరె అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి టి.రఘుమూర్తి
కుడ్లగి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీ శ్రీనివాస్
చామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సి.పుత్తరంగశెట్టి విజయం సాధించారు
చామరాజ్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి జమీర్ అహ్మద్ విజయం సాధించారు.
శివాజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ విజయం సాధించారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అయితే, తొలి ఫలితాలు విడుదలయ్యాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు ఖాతా తెరిచాయి.
చల్లకెరె – రఘుమూర్తి – కాంగ్రెస్
ఎల్లపురా – శివరామ్ – బీజేపీ
హసన్ – స్వరూప్ – జేడీఎస్
కర్ణాటక గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు.. బీజేపీవి దింపుడు కళ్ళం ఆశలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటకలో పూర్తి ఫలితాలు వచ్చాక మాట్లాడుతానంటూ పేర్కొన్నారు. హిందువును కాబట్టి గుడికి వెళ్తున్నా.. రాజకీయాలు చెయ్యనంటూ పేర్కొన్నారు. 120 సీట్లు దాటుతాయి అని ముందే చెప్పానంటూ వివరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. దర్శనం చేసుకునేందుకు రెడ్ హిల్స్ హనుమాన్ టెంపుల్ కు బయలుదేరారు.
బళ్లారి సిటీ నియోజకవర్గంలో గాలి జనార్థన్ రెడ్డి పార్టీ కొంప ముంచింది. మూడో స్థానంలో బిజెపి అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డి కొనసాగుతున్నాయి. రెండో స్థానంలో గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ ఉన్నారు. ఓట్లు చీలిక తో మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భరత్ ఉన్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. చిక్బల్లాపూర్ లో మంత్రి సుధాకర్, బళ్లారి రూరల్ లో మంత్రి శ్రీరాములు, చిక్‌మంగళూరులో స్వల్ప వెనుకంజలో మంత్రి సిటీ రవి ఉన్నారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ మంత్రి సొమ్మన వెనుకంజలో ఉన్నారు.
కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షులు దినేష్ గుండు రావు ముందజలో ఉన్నారు. గాంధీ నగర్ నియోజవర్గ నుండి దినేష్ గుండు రావు ఉన్నారు.
హుబ్లీ సెంట్రల్ లో ఓటమి దిశగా మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ ఉన్నారు.. 20వేల ఆధిక్యంలో హుబ్లీ సెంట్రల్ బిజెపి అభ్యర్థి మహేష్ ఉన్నారు.
అథనిలో భారీ ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ సావడి కొనసాగుతున్నారు. బిజెపి టికెట్ ఇవ్వలేదని షెట్టర్, సావడి కాంగ్రెసులోకి వెళ్లారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. పట్టణ ఓటర్లు మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఓల్డ్ మైసూరులో JDS ఆధిక్యానికి కాంగ్రెస్ పార్టీ గట్టిగానే గండి కొట్టింది. ఓల్డ్ మైసూరులో JDS రెండో స్థానానికి పడిపోయింది. ఇదే ప్రాంతంలో బీజేపీది థర్డ్ ప్లేస్. ఇక ముంబై కర్నాటకలో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇక్కడ బీజేపీకి ఝలక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ కర్నాటకలోనూ కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కేవలం కోస్టల్ కర్నాటక, బెంగళూరుల్లో మాత్రమే బీజేపీ ప్రభావం ఉంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ప్రైవేట్ హోటల్‌లో సమావేశం జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమీకరించేందుకు పార్టీ ప్లాన్ చేస్తోంది.
కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. బీజేపీ 73, కాంగ్రెస్ 115, జేడీఎస్ 29, కేఆర్పీపీ 1, ఎస్కేపీ 1, ఇతర 3 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. అభ్యర్థులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌ను సేఫ్ ప్లేస్‌గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ, పార్క్ హయత్, నోవాటెల్ హోటళ్లలో రూమ్‌లు బుక్ చేశారు. కర్నాటకకు చెందిన వ్యక్తులే రూమ్స్ బుక్ చేసినట్టు సమాచారం. కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులను హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లకు తరలిస్తారని చెబుతున్నారు.
గంగావతిలో మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌రెడ్డి లీడ్ లో ఉన్నారు. వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు అంటే… మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌రెడ్డి ప్రస్తావన లేకుండా ఉండదు. మొన్నటి వరకు బీజేపీలో ఉన్న జనార్దన్‌రెడ్డి.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ముందు.. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో ఏర్పాటు చేసిన పార్టీపైనే గాలి జనార్దన్‌రెడ్డి స్వయంగా కొప్పల జిల్లాలోని గంగావతిలో పోటీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల బళ్లారి వెళ్లడానికి అవకాశాలు లేకపోవడంతో కొప్పల జిల్లాలోని గంగావతిని ఎంచుకున్నారు జనార్దన్‌రెడ్డి. ఇంకోవైపు బళ్లారి సిటీలో గాలి జనార్దన్‌రెడ్డి భార్య అరుణ లక్షి పోటీ చేస్తున్నారు. మొత్తంగా గాలి జనార్దన్‌రెడ్డి తన పార్టీ తరఫున మొత్తం 15 మంది అభ్యర్థులను పోటీకి దించారు.
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. బీజేపీ వెనుకంజలో ఉంది. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ కీలక నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య టీవీ9 కన్నడలో వీక్షిస్తున్న దృశ్యం..
హైదరాబాద్‌లో కర్ణాటక క్యాంపు రాజకీయాలు.. తాజ్ కష్ణా, పార్క్‌హయాత్, నోవాటెల్ హోటళ్లను బీజేపీ, కాంగ్రెస్ నేతలు బుక్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీకి సమాచారమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు హైదరాబాద్ కు మారుతున్నట్లు అర్ధమవుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. బసవరాజ్ బొమ్మై (బీజేపీ-షిగ్గావ్), సిద్ధరామయ్య (కాంగ్రెస్), డీకే శివకుమార్ (కాంగ్రెస్), గాలి జనార్దనరెడ్డి, గాలి అరుణ (కేఆర్‌పీపీ) ముందంజలో ఉన్నారు. బళ్లారీలో సోమశేఖర్ రెడ్డి బీజేపీ, నిఖిల్ కుమారస్వామి(జేడీఎస్) ముందంజలో ఉన్నారు.
జేడీఎస్ కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. జగదీష్ షెట్టార్ వెనుకంజలో ఉన్నారు. బళ్లారీలో శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. ఇంకా బొమ్మై ప్రభుత్వంలోని 8మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
కనకపూర అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డీకే శివకుమార్ ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఆర్. అశోక్ వెనుకంజలో ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ ప్రభావం చూపలేకపోయింది. చెన్నపట్నంలో కుమారస్వామి వెనుకంజలో కొనసాగుతున్నారు. జేడీఎస్ కేవలం 15 స్థానాల్లోను ముందంజలో కొనసాగుతోంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. బొమ్మై ప్రభుత్వంలోని 8 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
గాలి జనార్థన్ రెడ్డి దంపతులు ముందంజలో ఉన్నారు.. చెన్నపట్నంలో కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు.
కర్ణాటక ఫలితాలు ఎర్లీ ట్రెండ్స్‌లో కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీ వెనుకంజలో ఉంది. 224 స్థానాలు.. 113 మేజిక్ ఫిగర్.. ఎన్నికల సంఘం ప్రకారం.. 224 సీట్లలో 12 సీట్లు కాంగ్రెస్, బీజేపీ 8, జేడీఎస్ 1సీటులో లీడ్ లో ఉన్నాయి.
బళ్ళారి రూరల్ నియోజకవర్గంలో మంత్రి శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. తొలిరౌండ్ పూర్తి అనంతరం కాంగ్రెస్ అభ్యర్ధి నాగేంద్రకు 5862 ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థి శ్రీరాములుకు 5032 ఓట్లు పోలయ్యాయి…మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి 830 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి నాగేంద్ర ఉన్నారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ లోపే నరాలు తెగేంత ఉత్కంఠతో బెట్టింగ్‌లు మొదలయ్యాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలపై పక్కా అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు , తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులోని పట్టణాల్లో తిష్టవేశారు. ఏకంగా క్యాష్ పట్టుకునే బహిరంగంగా బెట్టింగ్‌కి దిగారు. ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడంతో.. బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత యతీంద్ర సిద్ధరామయ్య. పొత్తులపై తాము ఎవర్నీ సంప్రదించలేదన్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు యతీంద్ర.
సిఎం బస్వరాజు బొమ్మై షిగ్గాన్ నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ దిగ్గజాలు సిద్ద రామయ్య వరుణ నుంచి, డీ.కే. శివకుమార్ కనకపుర, మాజీ సిఎం జగదీష్ షెట్టర్ హుబ్లి ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలో దిగారు. జేడీఎస్ నేత, మాజీ సిఎం కుమారస్వామి చెన్నపట్టణనుంచి పోటీ చేయగా…గంగావతి నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి నుంచి ఆయన భార్య అరుణ బరిలో నిలిచారు.
కర్నాటకలో ఏర్పడబోయే తదుపరి ప్రభుత్వం ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోనుంది. కౌంటింగ్ మొదలై ఫలితాలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకే మొగ్గు ఉంది. కన్నడ ప్రజలే కాదు.. అటు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగగా…36 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై డేగకన్ను పెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్ అమలులో ఉంది.
కాంగ్రెస్.. బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ప్రారంభమైంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది..
ఎగ్జిట్‌పోల్స్‌పై JDS అధినేత కుమారస్వామి స్పందించారు. ఇంతవరకు తనతో ఎవరూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. మరో రెండుమూడు గంటలు వేచి చూద్దాం.. నాకు ఎవరూ ఆఫర్ చేయలేదు.. ప్రభుత్వం ఏర్పాటు చేసేది నేనేనంటూ కుమారస్వామి పేర్కొన్నారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 224 అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ కోసం 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టడంతోపాటు.. బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. కర్నాటక ఫలితంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో JDS మళ్లీ కింగ్ మేకర్ అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, హంగ్ అవకాశమే లేదని.. గెలుపు తమదేనంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మధ్యాహ్నంలోగా కర్నాటక ఫలితం తేలనుంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తోంది. అయితే, జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందని అంచనాలు వేసిన నేపథ్యంలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్‌లను అధికారులు తెరిచారు. రిటర్నింగ్ అధికారి సమక్షంలో, ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది.. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించనున్నారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ లోపే నరాలు తెగేంత ఉత్కంఠతో బెట్టింగ్‌లు మొదలయ్యాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలపై పక్కా అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు , తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులోని పట్టణాల్లో తిష్టవేశారు. ఏకంగా క్యాష్ పట్టుకునే బహిరంగంగా బెట్టింగ్‌కి దిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్-బీజేపీ.. ఈ రెండింటిపై బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు.
కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 8గంటలకు ప్రారంభం కానుంది. మే 10న ఒకే దశలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 5,30,85,566 ఓటర్లలో.. 3,88,51,807 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో 73.19 శాతం పోలింగ్ జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు.. 144 సెక్షన్ అమలు చేశారు. ఇవాళ మొత్తం 2615 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 2430 మంది పురుష అభ్యర్థులు, 184 మంది మహిళా అభ్యర్థులు, ఇద్దరు థర్డ్ జెండర్ అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. బీజేపీకి 224, కాంగ్రెస్‌కు 223, జేడీఎస్ 207, ఆప్ 209, బీఎస్‌పీకి 133, సీపీఐ 4, జేడీయూ 8, ఎన్‌పీపీ 2, పార్టీయేతర అభ్యర్థులు 918 మంది బరిలో ఉన్నారు.
కర్ణాటక ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు?. ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది?. ఈ ప్రశ్నలకు మెజారిటీ ఎగ్జిట్‌పోల్ సర్వేలన్నీ దాదాపు ఒకే ఒక్క ఆన్సర్ చెప్పాయ్. సర్వేలన్నీ కాంగ్రెస్‌కే బిగ్గెస్ట్ నెంబర్స్‌ను కట్టబెట్టాయ్. కొన్ని సంస్థలు కాంగ్రెస్‌కి క్లియర్‌కట్ మెజారిటీ ఇస్తే, మరికొన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని చెప్పుకొచ్చాయ్. టీవీ9 సర్వేలో కూడా కాంగ్రెస్సే అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తేలింది. కాంగ్రెస్‌కి 99నుంచి 109 స్థానాలు, బీజేపీకి 88నుంచి 98 సీట్లు, జేడీఎస్‌కి 21నుంచి 26 స్థానాలు వస్తాయని అంచనా వేసింది టీవీ9 నెట్‌వర్క్ అండ్ పోల్‌స్ట్రాట్. మరి. ఎగ్జిల్‌పోల్ సర్వేలు నిజమవుతాయా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.