కార్గిల్ వీరుడి కన్నీటి గాథ.. 24 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం!

కార్గిల్ యుద్ధంలో గాయపడిన మాజీ సైనికుడు నాయిక్ శివానంద రెడ్డి, గత 24 ఏళ్లుగా తనకు రావాల్సిన భూమి, ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేయడంతో లోకాయుక్తను ఆశ్రయించారు. న్యాయం జరగక ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడికి ఎదురైన ఈ దుస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతోంది.

కార్గిల్ వీరుడి కన్నీటి గాథ.. 24 ఏళ్లుగా హక్కుల కోసం పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం!
Kargil Veteran In Karnataka

Updated on: Sep 02, 2026 | 12:40 PM

దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో పోరాడి గాయపడిన ఓ మాజీ సైనికుడు.. తన హక్కుల కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 24 ఏళ్లుగా భూమి, సైనిక సంక్షేమ ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని, అధికారులు మాత్రం కనికరించడంలేదంటూ.. చివరకు ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాయిక్ శివానంద రెడ్డి.. కార్గిల్ యుద్ధ సమయంలో గాయపడ్డారు. అనంతరం వైద్య కారణాలతో ఆర్మీ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో తనకు రావాల్సిన భూమి, ఇతర మాజీ సైనికుల సంక్షేమ ప్రయోజనాల కోసం అధికారులను ఆశ్రయిస్తూ వస్తున్నట్లు నాయిక్ శివానంద రెడ్డి చెబుతున్నారు.

రూ.10 లక్షల లంచం డిమాండ్..!

భూమి కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేందుకు 2022లో తనను రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారని శివానంద రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన లోకాయుక్తను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ పరిణామాల తర్వాత కూడా తన సమస్య పరిష్కారం కాలేదని శివానంద రెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు అనుకూలంగా లేని భూమిని అధికారులు చూపించారని, సరైన భూమి కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆయన వాపోయారు.

చివరకు ఆత్మహత్యాయత్నం!

ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఆగస్టు 29న శివానంద రెడ్డి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కార్గిల్ యుద్ధంలో పోరాడిన ఓ మాజీ సైనికుడు.. తనకు రావాల్సిన హక్కుల కోసం 24 ఏళ్ల పాటు పోరాడాల్సి రావడం, చివరకు ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.

తన సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, తనకు రావాల్సిన భూమి, ఇతర ప్రయోజనాలు అందించాలని శివానంద రెడ్డి కోరుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us