Trending: గుంతలు తవ్వుతున్నప్పుడు.. నిర్మాణాలు చేపడుతున్నప్పుడు, పొలాలు దున్నుతుప్పుడు అరుదైన పురాతన వస్తువులు, విగ్రహాలు, నాణేలు బయటపడిన ఘటనలు గురించి మనం వింటూనే ఉంటాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్( uttar pradesh)లోని జలాలాబాద్( jalalabad)లో ఓ రైతు పొలం దున్నుతుండగా అలాంటి ఘటనే లభించింది. పొలంలో పాతిక అరుదైన నాణేలతో కూడిన కుండ బయటపడింది. దాన్ని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం అందండంతో రాష్ట్ర పురావస్తు మ్యూజియం బృందం కూడా చేరుకుని కుండతో సహా నాణేలను స్వాధీనం చేసుకుంది. నాణేలను పరిశీలించిన తర్వాత.. వాటి కాలాన్ని నిర్ణయించి వాటిని మ్యూజియంలో ఉంచనున్నట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జలాలాబాద్ బ్లాక్ పరిధిలోని తేరగి గ్రామ పంచాయతీ మజ్రా ముస్రి గ్రామంలో ఆనంద్ కుమార్ జాతవ్ ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కల్టివేటర్ తగలడంతో భూమిలోని కుండ బయటపడింది. దీంతో ఆనంద్ ట్రాక్టర్‌ను ఆపి పొలంలోని మట్టిలో ఉన్న కుండను బయటకు తీయగా అందులో కొన్ని నాణేలు కనిపించాయి. తొలుత పొలంలో పాతిపెట్టిన నిధిని గుర్తించి ఇంట్లో భద్రపరిచిన ట్రాక్టర్ డ్రైవర్.. ఆ తర్వాత గ్రామంలోని కొందరికి ఈ విషయం చెప్పాడు. దీంతో నిధిని చూడాలనే కుతూహలం పెరిగి చాలా మంది అతని ఇంటికి చేరుకున్నారు. తొలుత బంగారు బిళ్లలుగా అనుమానం వచ్చినా.. కొందరు పెద్దలు తనిఖీ చేయగా రాగి ఇతర లోహల మిశ్రమంతో కూడిన నాణేలుగా గుర్తించారు. ప్రజల సమాచారంతో రాష్ట్ర పురావస్తు మ్యూజియం అధికారి దీపక్ కుమార్ తన బృందంతో ముస్రి గ్రామానికి చేరుకున్నారు. అతను రైతు నుంచి కుండను, నాణేలును స్వాధీనం చేసుకున్నాడు.
ఆ కుండలో 100కు పైగా నాణేలు ఉన్నాయని ఆయన తెలిపారు. అవి చాలా నాణేలు పురాతనమైనవని, ఏ కాలానికి చెందినవి అనే విషయంపై క్లారిటీ లేదన్నారు. కార్బన్ పరీక్షలో అవి ఏ కాలానికి చెందినవో తెలస్తుందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. పొలం ఉన్న చోట సుమారు 60 ఏళ్ల క్రితం కట్టించిన కచ్చా ఇళ్లు ఉండేవని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి