Attacked by jallikattu Bull : పోటీల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చెన్నై జల్లికట్టు పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పుదుకొట్టై జిల్లా కల్లూరులో బుధవారం జరిగిన పోటీల్లో ఇద్దరు మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోటీలను చూస్తున్న జనాలపైకి ఎద్దులు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎద్దు దాడిలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ముగిసినా.. ఎక్కడో ఒక చోట జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. పుదుకొట్టై జిల్లా కట్టూరు సహా దాని చుట్టుపక్కల గ్రామాల్లో జల్లికట్టుతో పాటు రెక్లా రేసులు కూడా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా యువత ఉత్సాహం చూపుతున్నారు. బుధవారం జల్లికట్టు పోటీల్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
కల్లూరు సమీపంలో బుధవారం జల్లికట్టు, రెక్లా రేసులు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన యువతతో పాటు… ఈ పోటీలను చూసేందుకు జనం భారీగా తరలిచ్చారు. ఎద్దులు, గుర్రపు బండ్లు గ్రౌండ్‌లో పరుగులు పెడుతున్నాయి. పరుగుతీస్తున్న ఎద్దులను నిలువరించేందుకు యువకులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బెదిరిపోయిన ఒక ఎద్దు పోటీలు చూస్తున్న జనంపైకి ఒక్కసారిగా దూసుకువచ్చింది. ఎదురుగా ఉన్నవాళ్లను పదునైన కొమ్ములతో గాయపరుస్తూ.. పరుగులు తీసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఎద్దుల దాడిలో గాయపడిన వారిని అరంతంగికి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో కూడా పలువురి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఎద్దు తమవైపు పరిగెత్తుకు రావడం ముందుగానే పసిగట్టిన పలువురు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
Read Also…. కోవిడ్ వైరస్ ఎక్కించుకునే వలంటీర్లు ? కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్న బ్రిటన్