ఎట్టకేలకు న్యాయం గెలిచింది. నిర్భయ ఆత్మ శాంతించింది. గత ఏడేళ్లుగా యావత్ భారత్ ఎదురుచూసిన క్షణం వచ్చింది. నిర్భయ దోషులను ఉరి కొయ్యలకు వేలాడదీశారు. కాగా ఈ కేసులో తప్పించుకునేకునేందుకు ఆ దోషులు సకల ప్రయత్నాలు చేశారు. కానీ న్యాయదేవత ముందు వారి పప్పులు ఉడకలేదు. ఇదిలా ఉంటే తమకు శిక్ష నుంచి మినహాయింపు వస్తుందేమోనని చివరి క్షణం వరకు ఆశగా ఎదురుచూసిన నిర్భయ దోషులు అక్షయ్, ముఖేశ్, పవన్, వినయ్ నిద్రలేని రాత్రి గడిపారట. ఉరిశిక్షను తప్పించుకునేందుకు న్యాయ ప్రక్రియలు ముగిసిపోవడం.. ఉరికంబం ఎక్కాల్సి రావడంతో వారు ఆందోళనకు గురయ్యారట. రాత్రి పూట ఆహారం కూడా తీసుకోలేదని తీహార్ జైలు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రాత్రంతా నలుగురు విడి విడి గదుల్లో ఏకాంతంగా ఉన్నారని.. అంతకుముందు రోజులాగా కాకుండా.. రాత్రి ఆహారం కూడా తీసుకోలేదని వివరించారు. తమకు కోర్టుల్లో ఊరట లభిస్తుందేమోనని శుక్రవారం తెల్లవారుజామున 3.30 గం.ల వరకు ఉత్కంఠగా ఎదురుచూశారని తెలిపారు. కానీ ఏ న్యాయస్థానంలో ఊరట లభించకపోవడంతో వారు నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. కాగా నిర్భయ ఘటన జరిగిన దాదాపు ఏడేళ్ల తరువాత దోషులను ఉరి తీసిన విషయం తెలిసిందే.
Read This Story Also: నిర్భయ దోషులు జైల్లో ఎంత సంపాదించారంటే..!