బాత్రూంలో జారిపడి విద్యాశాఖ మంత్రి కన్నుమూత..! ప్రముఖుల సంతాపం..

ఆగస్ట్ 2న జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ తన నివాసంలోని బాత్రూంలో జారి పడిన సంగతి తెలిసిందే. సోరెన్ మెదడుకు తీవ్ర గాయం కావడంతో పాటు రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అదే రోజు అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. అప్పట్నుంచి..

బాత్రూంలో జారిపడి విద్యాశాఖ మంత్రి కన్నుమూత..! ప్రముఖుల సంతాపం..
Jharkhand Education Minister Ramdas Soren

Updated on: Aug 17, 2025 | 4:09 PM

రాంచీ, ఆగస్ట్‌ 17: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రాందాస్ సోరెన్ (62) అనారోగ్యంతో శుక్రవారం (ఆగస్ట్ 15) మరణించారు. న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నా తండ్రి ఇప్పుడు మన మధ్య లేరని చాలా బాధతో మీ అందరికీ తెలియజేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. ఆగస్ట్ 2న రాందాస్ తన నివాసంలో బాత్రూంలో జారి పడ్డారు. సోరెన్ మెదడుకు తీవ్ర గాయం కావడంతో పాటు రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అదే రోజు అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు.

అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డారు. రాందాస్ సోరెన్ మృతికి నివాళిగా జార్ఖండ్ ప్రభుత్వం ఒకరోజు సంతాపం దినంగా ప్రకటించింది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు మరణించడంతో జార్ఖండ్ రాజకీయాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. సోరెన్‌ మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా సోరెన్ అనారోగ్యం కారణంగా వర్షాకాల సమావేశంలో విద్య, అక్షరాస్యత శాఖ బాధ్యతలను సుదివ్య కుమార్ సోనుకు అప్పగించిన సంగతి తెలిసిందే. సోరెన్‌కు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

ఇదీ సోరెన్‌ రాజకీయ ప్రస్థానం..

1963, జనవరి 1న తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలోని ఘోరబంద గ్రామంలో జన్మించిన సోరెన్ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఘోరబంద పంచాయతీ గ్రామ ప్రధాన్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన సోరెన్‌.. అంచెలంచెలుగా ఎదిగి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో అత్యంత ప్రభావవంతమైన మంత్రులలో ఒకరిగా ఎదిగారు.1990లో ఆయన JMM పార్టీకి జంషెడ్‌పూర్ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత ఘట్‌శిల అసెంబ్లీ స్థానం నుంచి 2005 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యత్నించారు. కానీ ఆ సీటు జెఎంఎం కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు దక్కింది. అయితే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం సోరెన్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఘట్శిల నుంచి పోటీ చేసి మొదటిసారి జార్ఖండ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ తుడు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2019లో తిరిగి ఆ సీటును కైవసం చేసుకున్నారు. 2024లో మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ కుమారుడు, బీజేపీకి చెందిన బాబులాల్ సోరెన్‌ను ఓడించి.. సోరెన్ మూడోసారి కూడా ఇదే స్థానాన్ని గెలుచుకున్నారు. హేమంత్ సొరెన్ నేతృత్వంలోని కేబినెట్లో విద్యా, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.