ఇవాళ దేశ వ్యాప్తంగా బంగారు వ్యాపారులు.. స్ట్రైక్ చేస్తున్నారు. జ్యువెలరీ మార్కెట్ మొత్తం బందు పెట్టారు. కేంద్రం విధించిన హాల్ మార్క్ కంపల్సరీని వ్యతిరేకిస్తూ.. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హాల్ మార్క్ ఎందుకుండాలి? ఎందుకొద్దూ? కేంద్రం ఏం చెబుతోంది? చిరు వ్యాపారులు ఎందుకు కాదంటున్నారు? బంగారం కొనుగోళ్లపై కేంద్రం కొత్త రూల్స్ విధించింది. ఇకపై పసిడి అమ్మకాలు జరపాలంటే హాల్ మార్క్ ఉండాల్సిందే.అసలు హాల్ మార్క్ అంటే ఏంటి? ఈ గుర్తును ఎలా కేటాయిస్తారు ? కేంద్రం ఈ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చింది ?
దేశంలో బంగారం రేట్లు అమాంతం పెరుగుతూనే ఉన్నా.. అమ్మకాల్లో జోష్ మాత్రం తగ్గదు. అలంకరణ కోసం కొనేవారు కొందరైతే.. ఆదాయం మరికొందరి ఆలోచన. అయితే ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది కేంద్రం. బంగారం అమ్మకాలు కొనుగోళ్లపై కేంద్రం సరికొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. జూన్ 15 నుంచి.. అంటే రేపటి నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తోంది. ఇకపై బంగారం కొనే వారు, అమ్మేవారు ఈ నియమాలు పాటించాల్సిందే.
బంగారంపై హాల్ మార్క్ తప్పనిసరి చేసింది కేంద్రం. చెవిదిద్దుల దగ్గర నుంచి ముక్కుపోకు వరకు అన్ని ఆభరణాలకు హాల్ మార్క్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంపై దుకాణదారుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బంగారంపై కేంద్ర నిబంధనను స్వాగతిస్తున్నట్టు పలువురు గోల్డ్ షాపు నిర్వాహకులు చెప్తున్నారు. హాల్ మార్క్ ఉన్న నగను కొంటే.. వినియోగదారులు ఎన్ని సంవత్సరాల తర్వాతైనా మార్చుకోవచ్చని అంటున్నారు. బీఎస్‌ఐ చెకింగ్ తప్పనిసరి చేయడంతో.. మోసాలు తగ్గే అవకాశం ఉందంటున్నారు.
అయితే చిన్న, చిన్న దుకాణ దారుల వర్షన్ వేరేగా ఉంది. పెద్ద షాపుల్లో 10 నుంచి 20 శాతం వేస్టేజ్ వేస్తారనీ.. చిన్న దుకాణాల్లో అంత తరుగు తీసేస్తే కస్టమర్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 24 క్యారెట్ల బిస్కెట్ ఇస్తే.. 22 క్యారెట్ల బంగారం మాత్రమే తయారు చేయగలమని అంటున్నారు.
గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తూ ఇచ్చే లోగో. హాల్‌మార్కింగ్ ఇవ్వడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొన్ని ప్రమాణాలు పెట్టింది. వాటి ప్రకారం ఆభరణం స్వచ్ఛతను బట్టి హాల్ మార్క్ కేటాయిస్తారు. బంగారం ఎక్కడ తయారయినా, విక్రయించినా హాల్ మార్క్ తప్పనిసరిగా ఉండేలా.. గోల్డ్ షాప్ యజమానులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. BIS వద్ద తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. హాల్ మార్క్ చేసిన ఆభరణాలే విక్రయించాలి.
లేదంటే బంగారం ధర ఎంతైతే ఉంటుందో.. దానికి 5 రెట్ల జరిమానా విధించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుందని కేంద్రం తెలిపింది. వినియోగదారుల నుంచి నగలు తీసుకున్నా.. వాటిని కరిగించి, తిరిగి ఇచ్చేటప్పుడు హాల్ మార్క్‌తో ఉన్న నగనే అమ్మాలి. ఆభరణానికి హాల్ మార్క్ వేసేందుకు కేవలం 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే నగలకూ హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండాలి.
ప్రతి జువెలరీ షాపులో మూడు రకాల క్యారెట్ల నగల రేట్లను బోర్డులో చూపించాలి. ఒక్కో కస్టమర్‌కి ఒక్కో రేట్ చెబితే కుదరదు. ప్రజల దగ్గర ఉన్న పాత బంగారంపై హాల్ మార్క్ లేకపోయినా దుకాణదారులు కొనాల్సిందే. దాన్ని కరిగించి హాల్ మార్క్‌తో నగలు తయారుచేసి అమ్మాలి. ఎన్ని క్యారెట్ల నగ అమ్మారు.. ఎంత రేటు తీసుకున్నారనే వివరాలతో స్పష్టమైన సర్టిఫికెట్ ఇవ్వాలి. లేదంటే చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరిస్తోంది.
ఇవి కూడా చదవండి: Aadhaar Card: ఈ సంగతి మీకు తెలుసా.. మీ ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి …