
జపాన్ ప్రధాని సనాయే తకైచీ జూలై 1న న్యూఢిల్లీకి రానున్నారు. ఆమె భారత పర్యటన జూలై 3 వరకు కొనసాగుతుంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా, ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. భారత్, జపాన్‌ల మధ్య ఇది 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం. గత సంవత్సరం ప్రధాని మోదీ టోక్యోలో పర్యటించగా.. ఈసారి భారత్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తోంది. ప్రతీ సంవత్సరం ఈ రెండు దేశాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం సంప్రదాయంగా మారింది.
పెట్టుబడులు: గత సంవత్సరం టోక్యోలో జరిగిన సమావేశంలో రాబోయే పదేళ్లలో భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించాలని జపాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా స్పష్టమైన పురోగతి సాధించడంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. టయోటా సుషో, ఇటోచు, సుజుకి వంటి ప్రధాన జపనీస్ కంపెనీల ఉన్నతాధికారులు కూడా టకైచీతో పాటు భారతదేశానికి రానున్నారు. ఇరు దేశాల పారిశ్రామికవేత్తల మధ్య ఒక ఉన్నత స్థాయి వ్యాపార సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది
రక్షణ సహకారం: రక్షణ రంగంలో సహకారం కూడా చర్చలో ఒక కీలక అంశంగా ఉంటుంది. గతేడాది ఇరు దేశాలు భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. ఈసారి ఉమ్మడి రక్షణ ఉత్పత్తులు, సముద్ర భద్రత, నౌకాదళ సహకారం, ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సహకారం ఇరు దేశాలకు వ్యూహాత్మకంగా కీలకంగా మారింది.
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు: సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, బ్యాటరీ టెక్నాలజీ కూడా ఎజెండాలో ఉంటాయి. చిప్ తయారీ, అవసరమైన ఖనిజాలు, స్వచ్ఛ ఇంధన సరఫరా గొలుసుల కోసం ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించాలని భారతదేశం, జపాన్ లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇంధన భద్రత: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో LNG సరఫరాలను, ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది. LNGని నిల్వచేయడానికి సంబంధించి సహకారం, ఉమ్మడి కార్యాచరణపై కూడా చర్చించవచ్చు.
ప్రజల మధ్య సంబంధాలు: రాబోయే ఐదేళ్లలో 5 లక్షల మందికి పైగా నిపుణులను జపాన్‌కు పంపించే అంశంపై భారత్, జపాన్ చర్చించవచ్చు. సుమారు 50,000 మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులను జపాన్‌కు పంపే ప్రణాళిక కూడా ఇందులో భాగంగా ఉంది.
మౌలిక సదుపాయాలు: ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ కూడా చర్చనీయాంశం కానుంది. జపాన్ నుండి రాయితీ రుణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఒక ప్రధాన చిహ్నంగా ఉంది. జపాన్ అధికారిక అభివృద్ధి సహాయంలో భారతదేశం అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది.
జపాన్ ప్రధానమంత్రి తకైచి టోక్యో నుంచి నేరుగా భారతదేశానికి రావడం లేదు. ఆమె ఇంతకుముందు రోమ్ వెళ్లారు. అక్కడ ఆమె ఇటలీ ప్రధానమంత్రితో జపాన్ ఇండో-పసిఫిక్ వ్యూహం గురించి చర్చించారు. ఈ సంవత్సరం జపాన్ స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో-పసిఫిక్ దార్శనికతకు పదవ వార్షికోత్సవం. ఈ వ్యూహాన్ని మాజీ ప్రధానమంత్రి షింజో అబే ప్రారంభించారు. ఇప్పుడు తకైచి ఆయన రాజకీయ సిద్ధాంతానికి కీలక వారసురాలిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భారతదేశ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులకు మాత్రమే పరిమితం కాకుండా.. జపాన్ ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను కూడా నొక్కి చెబుతోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రాని సనాయ్ తకైచి తొలిసారిగా ముఖాముఖి శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు. పెట్టుబడులు, రక్షణ, సెమీకండక్టర్లు, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక సవాళ్లు ఈ సమావేశంలో ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. ప్రారంభంలో పర్యటన ప్రణాళికలో అస్సాంలోని గౌహతిని చేర్చడం గురించి చర్చలు జరిగాయి. ఈ దిశగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి ఆ ప్రణాళికను విరమించుకున్నారు. ప్రధానమంత్రి తకైచి తీరికలేని షెడ్యూల్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం జపాన్ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున, ఆమె పర్యటన న్యూఢిల్లీకే పరిమితమైంది. ఒకవేళ గౌహతిని చేర్చి ఉంటే ఈశాన్య భారతదేశంలో భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగడం ఇదే మొదటిసారి అయ్యేది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. మరోవైపు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్ కూటమి కూడా ప్రాంతీయ భద్రతను, సరఫరా గొలుసులను బలోపేతం చేయడంపై నొక్కి చెబుతోంది. ఈ నేపథ్యంలో మోదీ-టకైచీ చర్చలు కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కావు. అవి మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతపు వ్యూహాత్మక భౌగోళిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపగలవు. ఇది ద్వైపాక్షిక సమావేశమే అయినప్పటికీ, ఇందులో చర్చించబోయే అంశాలు.. చైనా, సముద్ర భద్రత, సైబర్ భద్రత, కీలక సాంకేతికతలలో సహకారం వంటివి క్వాడ్ అజెండాతో కూడా ముడిపడి ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు దేశాల చర్చలను అమెరికా, ఆస్ట్రేలియా కూడా నిశితంగా గమనిస్తాయి.