Landslides: జమ్మూకాశ్మీర్‌లో జలప్రళయం.. కొండచరియలు విరిగి ఏడుగురు దుర్మరణం!

జమ్మూ - కాశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నౌషెరా, పూంచ్‌తో పాటు పలు ప్రాంతాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. పూంచ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత సైన్యం, జమ్మూ–కాశ్మీర్ పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.

Landslides: జమ్మూకాశ్మీర్‌లో జలప్రళయం.. కొండచరియలు విరిగి ఏడుగురు దుర్మరణం!
Jammu Kashmir Landslides

Updated on: Jul 20, 2026 | 6:55 PM

జమ్మూ – కాశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నౌషెరా, పూంచ్‌తో పాటు పలు ప్రాంతాలు వరదలతో అతలాకుతలమయ్యాయి. పూంచ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత సైన్యం, జమ్మూ–కాశ్మీర్ పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సహాయక చర్యలు తీవ్రంగా సవాలుగా మారాయి. ఆకస్మిక వరదలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహం ప్రవాహంలో చిక్కుకుపోవడంతో, దాన్ని వెలికితీయడం మొదట సాధ్యం కాలేదు. బలమైన ప్రవాహం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోలేకపోయాయి. దీంతో భారత సైన్యం, జమ్మూ–కాశ్మీర్ పోలీసులు హెలికాప్టర్ సహాయంతో ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్ ద్వారా సహాయక సిబ్బందిని సంఘటనా స్థలానికి చేర్చి, క్లిష్ట పరిస్థితుల్లో మృతదేహాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్, కుల్గామ్, షోపియాన్ జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నీటిపారుదల, వరద నియంత్రణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. దీంతో నదులు, వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు నదులు, వాగులు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక పరిపాలన జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us