ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసు

అనంతపురం ఇస్కాన్ గోశాలపై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇటీవల తాను ఇక్కడ పర్యటించినప్పుడు ఒక్క గొడ్డు ఆవుకానీ, ఎద్దు కానీ, దూడ కానీ చూడలేదంటూ ఆమె ఆరోపిస్తున్న ఓ వీడియో రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇస్కాన్ సంస్థ మోసపూరితమైన సంస్థగా ఆమె ఆరోపించారు. గొడ్డు ఆవులను ఇస్కాన్ సంస్థ కసాయిలకు విక్రయిస్తోందంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు.

ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసు
Maneka Gandhi

Updated on: Sep 29, 2023 | 7:36 PM

ISKCON Notice to MP Menaka Gandhi: అనంతపురం ఇస్కాన్ గోశాలపై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇటీవల తాను ఇక్కడ పర్యటించినప్పుడు ఒక్క గొడ్డు ఆవుకానీ, ఎద్దు కానీ, దూడ కానీ చూడలేదంటూ ఆమె ఆరోపిస్తున్న ఓ వీడియో రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇస్కాన్ సంస్థ మోసపూరితమైన సంస్థగా ఆమె ఆరోపించారు. గొడ్డు ఆవులను ఇస్కాన్ సంస్థ కసాయిలకు విక్రయిస్తోందంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇస్కాన్ కంటే ఎక్కువగా ఆవులను మరెవరూ కబేళాలను పంపడం లేదన్నారు. గోశాలల పేరుతో ఇస్కాన్ ప్రభుత్వాల నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతోందని మేనకా గాంధీ పేర్కొనడం ఆ వీడియోలో రికార్డయ్యింది. మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇస్కాన్ సంస్థ ఇప్పటికే తోసిపుచ్చింది. ఆమె ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొంది.

ఇస్కాన్ సంస్థపై మేనకా గాంధీ సంచలన ఆరోపణలు.. వీడియో

ఈ నేపథ్యంలో ఎంపీ మేనకా గాంధీపై చట్టపరమైన చర్యలను ఇస్కాన్ సంస్థ మొదలుపెట్టింది. తమ సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన మేనకా గాంధీకి ఇస్కాన్ సంస్థ రూ.100 కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపింది. ఇస్కాన్ కొల్‌కత్తా విభాగ ఉపాధ్యక్షుడు రాధారమన్ దాస్ ఈ నోటీసులు పంపారు. మేనకా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన నిరాధార ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ భక్తులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారంనాటు పరువు నష్టం దావా నోటీసులను మేనకా గాంధీకి పంపినట్లు వెల్లడించారు. గతంలో కేంద్ర మంత్రికి పనిచేసిన ఎంపీ.. ఇలా ఓ భారీ ధార్మిక సంస్థపై నిరాధార ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు.

మేనకా గాంధీ అనంతపురం గోశాలకు రాలేదు: ఇస్కాన్

ఈ నేపథ్యంలో ఇస్కాన్ గోశాలపై మేనకా గాంధీ చేసిన ఆరోపణలను అనంతపురం ఇస్కాన్ మందిర్ ప్రతినిధి దామోదర్ ఖండించారు. మేనకా గాంధీ అనంతపురంలోని గోశాలను సందర్శించినట్లు వీడియోలో చెప్పుకున్నారని.. అయితే ఆమె ఎప్పుడూ ఇక్కడి గోశాలకు రాలేదని తెలిపారు. ఎవరో చెప్పిన దానిని ఆమె చెప్పడం దారుణమని మండిపడ్డారు. గోశాలలో ఆవులను వధశాలలకు అమ్ముతున్నారని మేనకా గాంధీ ఆరోపించడం అవాస్తమని, నిరాధారమని స్పష్టంచేశారు. అదే సమయంలో జంతు హక్కుల కార్యకర్తగా ఆమెపై తమకు చాలా గౌరవం ఉందన్నారు. మరోసారి ఆమె ఇక్కడికి వచ్చి గోశాలను సందర్శించవచ్చని చెప్పారు. మేనకా గాంధీ ఇస్కాన్ సంస్థపై చేసిన వ్యాఖ్యలపై తాము న్యాయపరంగా వెళ్తామని చెప్పారు. ఇన్ని సంవత్సరాల్లో ఇస్కాన్ సంస్థపై ఎలాంటి ఆరోపణలు లేవని.. అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. అనంతపురం గోశాలలో 412 ఆవులను సంరక్షిస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఇందులో పాలు ఇచ్చేవి 18 మాత్రమేనని చెప్పారు. మిగిలినవి పాలు ఇవ్వకున్నా వాటిని సంరక్షిస్తున్నట్లు చెప్పారు. ఒక్కదాన్ని కూడా కబేళాలకు తరలించిన సందర్భం లేదన్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..