
Indigo Flights Cancell: దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా పేరుగాంచిన ఇండిగో చరిత్రలో ఎన్నడూ లేనంతగా చెత్త అనుభవాలను మూటకట్టుకుంటుంది. ఒకేసారి వెయ్యికిపైగా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అపకీర్తి తెచ్చుకుంటుండగా.. మరోవైపు మరో ఆ సంస్ధ తీరు కూడా మాయని మాచ్చగా మారుతోంది. భారీగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో ఓ హృదయవిదారక వీడియో నెటిజన్లకు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిన సందర్భంలో ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో ఆందోళనను రేకెత్తిస్తోంది.
ఈ వీడియోలో ఓ తండ్రి తన కూతురికి రక్తస్రావం అవుతుందని, శానిటరీ ప్యాడ్ అందించాల్సిందిగా ఇండిగో సిబ్బందిని కోరారు. కానీ తాము శానిటరీ ప్యాడ్స్ అందించలేమంటూ వాళ్లు తిరస్కరించారు. “నా కూతురికి రక్తస్రావం తీవ్రంగా అవుతుంది.. సోదరి దయచేసి శానిటరీ ప్యాడ్ ఇవ్వండి” అంటూ తండ్రి బాధతో సిబ్బందిని వేడుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. కానీ దీనికి సమాధానంగా “మేము శానిటరీ ప్యాడ్‌లను అందించలేమ” అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. ఈ వీడియోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఇండిగో తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ సమయంలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. అసలు మానవత్వం కూడా చూపించకుండా ప్రవర్తించడం అత్యంత దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. వేలకు వేలకు టికెట్ల ధరలు వసూలు చేసే సంస్థలు.. ప్రయాణికులకు కనీసం సాధారణ సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమంటున్నారు.
ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, స్కూల్స్, మాల్స్‌లో శానిటరీ ప్యాడ్ ఏటీఎంలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. శానిటరీ ప్యాడ్‌ల లాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం హృదయ విదారకం అని, ఇలాంటి ఘటనలను అసలు సహించకూడదని అంటున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్‌లో డిమాండ్ చేస్తున్నారు.