Food Processing Industry: 2.89 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

|

Dec 09, 2024 | 6:13 PM

దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అక్టోబర్ 31 నాటికి దాదాపు 2.89 లక్షల మందికి పైగా ఉపాధిని సృష్టించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది..

Food Processing Industry: 2.89 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
Food Processing Industry
Follow us on

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ రంగంలో అక్టోబర్ 31 నాటికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (PLI) 2.89 లక్షల మందికి పైగా ఉపాధిని సృష్టించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దేశంలోని 213 ప్రాంతాల్లో రూ.8,910 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం PLI పథకం (PLISFPI) 2021-22 నుంచి 2026-27 వరకు అమలు చేయడానికి రూ.10,900 కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ పథకం కింద దాదాపు 171 మంది దరఖాస్తుదారులను నమోదు చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. PLISFPI కింద లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వన్‌ టైమ్‌ ఎక్సర్‌సైజ్‌ కింద జరిగింది. క్రియాశీల వాటాదారుల విస్తృత భాగస్వామ్యం కోసం విస్తృతమైన ప్రచారం కూడా చేపట్టారు. దేశీయ వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించడం తప్పనిసరి చేయడం ద్వారా, ఈ పథకం స్థానిక ముడిసరుకు సేకరణను గణనీయంగా పెంచినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. దీనిద్వారా రైతుల ఆదాయం వృద్ధి చెందుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా, ప్రాసెస్ చేసిన ఆహారం కోసం ముడి పదార్థాల స్థానిక ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, తద్వారా వ్యవసాయం వెలుపల అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడి, గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

దేశీయ తయారీ, దేశీ ముడి పదార్థాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఉపయోగపడినట్లు, ఫలితంగా దేశ ప్రగతికి ఈ పథకం గణనీయంగా దోహదపడినట్లు పేర్కొంది. ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY), PLISFPI, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్‌ వంటి పథకాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (SME) కేంద్రం సక్రియంగా మద్దతు ఇస్తుందని వెల్లడించింది. ఈ పథకాలు SMEలకు ఆర్థిక, సాంకేతిక, మార్కెటింగ్‌కు మద్దతును అందిస్తాయని.. సామర్థ్య విస్తరణ, ఆవిష్కరణ, అధికారికీకరణను సులభతరం చేస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు విదేశాల్లో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తారు. వారి ఖర్చులో 50 శాతం కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. వారి వార్షిక ఆహార ఉత్పత్తుల అమ్మకాలలో 3 శాతం లేదా ఏడాదికి రూ. 50 కోట్లు చొప్పున ఏది తక్కువైతే అది తిరిగి చెల్లించబడుతుంది. ఈ పథకం కింద దరఖాస్తుదారులు అర్హత సాధించడానికి ఐదేళ్లలో కనీసం రూ. 5 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం PLI పథకం కింద 73 మంది లబ్ధిదారులు ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.